
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పోరాటం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమరావతిని ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా గ్రాఫిక్స్‌తో కాలయాపన చేసి.. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో సొంత సంపదకు, తన బినామీల సంపద సృష్టికి ఎక్కడ విఘాతం కలుగుతుందోననేదే చంద్రబాబు భయం అని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరుతో ఆ ప్రాంత ప్రజలను భ్రమల్లో ఉంచి, 600 రోజుల పేరుతో టీడీపీ పండగ చేసుకుంటోందని, ఇకనైనా ఆ భ్రమల్లో నుంచి బాబు బయటకు రావాలని ఆయన హితవు పలికారు. అమరావతి ఆందోళనాకారులపై ఏదో జరిగి పోతోందంటూ ఉదయం నుంచి టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియా గోరంతను కొండంత చేసి చూపించే ప్రయత్నం చేసిందన్నారు. టీడీపీ హయాంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద దమనకాండ చేయదని స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న దళితులను అవమానించినందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
సమన్యాయం ప్రభుత్వ లక్ష్యం
వికేంద్రీకరణే ఈ ప్రభుత్వ విధానం అని, అమరావతి అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు స్వార్థంతోనే అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని, ఆయన తప్పిదాల వల్లే దారుణంగా ఓటమి చెందినా బాబుకు, లోకేశ్‌కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల నుంచి గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదన్నారు.
అమరావతి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న
విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, అయినా అచ్చెన్నాయుడు అమరావతి టీడీపీ అధ్యక్షుడిగా మాట్లాడారే తప్ప, ఏపీ టీడీపీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని విమర్శించారు. యనమల రామకృష్ణుడు మోసం, దివాళాకోరుతనం అంటూ మాట్లాడుతున్నారని.. ఆనాడు చంద్రబాబు, ఎన్టీఆర్‌ను మోసం చేసినప్పుడు స్పీకర్‌గా ఉన్న ఆయన ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. నియంతల్లా పాలించినందుకే ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారనే విషయాన్ని బాబు సహా నేతలంతా గుర్తుంచుకుంటే మంచిదన్నారు.