చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదేనేమో! | KSR Comments On Chandrababu Naidu Over Schemes In AP, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదేనేమో!

Apr 5 2025 11:07 AM | Updated on Apr 5 2025 12:03 PM

 KSR Comments On Chandrababu Over Schemes In AP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్తపాట ఎత్తుకున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కిన బటన్లు అన్నీ తామిస్తున్న పెన్షన్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదే కావచ్చు. ఏం చెబుతున్నానన్న దానితో నిమిత్తం లేకుండా చెప్పుకుంటూ పోవడమే ఆయన నైజంగా కనిపిస్తోంది ఇలాంటివి చూస్తూంటే. చంద్రబాబు తాలూకూ గొప్పలు ఇంకొన్నింటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.

ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు రూ.నాలుగు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ల పంపిణీ చేయడానికి ఆయన లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంతేకాదు.. ఈ నెల మొదటి తేదీన చంద్రబాబు పర్యటనలో మరో విచిత్రమూ కనిపించింది. తన సభకు రావాలని ఆయన దారిలో కనిపించిన వారినల్లా కోరుకున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఇలాంటి రికార్డు ఉండదేమో. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడం తప్పు కాదు కానీ పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు చిన్న, పెద్ద కార్యక్రమాలన్నింటికీ హెలికాఫ్టర్ వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించడం మాత్రం అంత హర్షణీయమైన విషయం కాదు.

వృద్ధాప్య ఫించన్లున్ల పంపిణీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దశాబ్దాలుగా సాగుతున్న విషయమే. గత ఎన్నికల్లో ఇచ్చిన అనేకానేక హామీలను ఎగ్గొట్టిన బాబుగారు ఫించన్‌ మొత్తాన్ని వెయ్యి రూపాయలైతే పెంచారు. అయితే, పెంచిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు నెల నెలా ముఖ్యమంత్రి వెళ్లడం ఏమిటో? హెలికాప్టర్‌ ఖర్చుతోపాటు సీఎం పర్యటన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టిన విషయాన్ని మరపించేందుకు ఇలా చేస్తున్నారేమో మరి!.

వైఎస్‌ జగన్ హయాంలో వలంటీర్లు మాత్రమే ఫించన్లు పంపిణీ చేసేవారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రతినెల ఒకటవ తేదీన తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. జగన్‌కూ మంచి పేరు తెచ్చింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ముగిసేనాటికి ఫించన్ల మొత్తం రూ.రెండు వేలు ఉంటే, జగన్ ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.మూడు వేలకు తీసుకెళ్లారు. అది కూడా ఇంటివద్దే అందేది. అంతకుమునుపు మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ లేదా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన ఖర్మ వృద్ధులకు తప్పింది. ఇలాంటి సువ్యవస్థితమైన వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు చెడగొట్టాయి. జగన్‌కు మంచిపేరు రాకూడదన్న ఉక్రోశంతో వలంటరీ వ్యవస్థలపై అవాకులు చెవాకులు మాట్లాడారు.

అయితే, జనం నుంచి వచ్చిన నిరసన చూసిన తరువాత మాటమార్చారు. తాము  అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లయితే ఇస్తున్నారు కానీ.. కొన్నిచోట్ల ఇది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బాపట్ల జిల్లాలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని నివ్వరపోయేలా చేస్తుంది. జగన్ ను ఉద్దేశించి గతంలో బటన్లు నొక్కేవారని, ఆ బటన్లు అన్నీ కలిపి తామిచ్చే ఫించన్లకే సమానం అని కొత్త అసత్యాన్ని సృష్టించారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు  ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ఇవ్వడం లేదని తన గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ టైమ్‌లో ఫించన్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. ఇప్పుడు రెండు లక్షలు తగ్గింది.

2019 వరకు చంద్రబాబు టైమ్‌లో అందిన ఫించన్లు సుమారు 44 లక్షల మందికే. ఇప్పుడు పెరిగిన పెన్షన్లు అన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారన్నమాట. అప్పట్లో బటన్‌లు నొక్కితే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత తాను అంతకన్నా ఎక్కువ బటన్లు నొక్కుతానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. అయినా జగన్ కన్నా సంక్షేమానికి తానే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. జగన్ టైమ్ కన్నా రూ.వెయ్యి ఎక్కువ  ఇస్తే, ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం సుమారు 640 కోట్లే. మరి దీంతోనే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందించినట్లు ఎలా అవుతుంది?. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఏభై ఏళ్లకే ఫించన్‌ ఇస్తామని ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడరు.

జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.ఏభై వేల కోట్ల స్కీములకు అమలు చేశారు. చంద్రబాబు యథాప్రకారం వీటిపై అసత్యాలను ప్రచారం చేసి వచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అట. గత ప్రభుత్వం నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కట్టాలట. ఇవి ఎంత నిజమో ఇప్పటికే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలియచేసింది. జగన్ టైమ్‌లో కరోనా రెండేళ్లు ఆర్థిక సంక్షోభాన్ని  సృష్టించినా, ఏ నెలా జీతాలు ఆపలేదు. ఇప్పుడేమో జీతాలకు డబ్బులు లేవంటున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయినప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. కానీ, 2024లో జగన్ ప్రభుత్వం తప్పుకునే నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలున్నాయి. పోనీ, చంద్రబాబు చెప్పినట్లు పది లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నా, దానిలో ఆయన 2014-19 మధ్య చేసిన అప్పు ఎంత? 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు ఎంత? విభజన ద్వారా వచ్చిన అప్పు వాటా ఎంత? అన్నది చెప్పకుండా మొత్తం జగన్ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో  రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది చంద్రబాబే, బడ్జెట్లో అది ఆరున్నర లక్షల కోట్లేనని తేల్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. అయినా పది లక్షల కోట్ల అప్పు అని అబద్దాలు  చెబుతున్నది ఆయనే. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేసి సరికొత్త రికార్డు  సృష్టించింది చంద్రబాబే. 14 లక్షల కోట్ల అప్పు  ఉందంటూనే, తాను అధికారంలోకి వస్తే  అప్పు చేయకుండా సంపద సృష్టించి పేదలకు స్కీములు అమలు చేస్తానని బొంకింది కూటమి పెద్దలే కదా!. ఇప్పుడేమో ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నది వారే. అంతేకాక అమరావతి రాజధానిని నిర్మించడం ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తానని ఈ విడత చెప్పారు. అంటే ఏమిటి దీని అర్ధం. ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయనని అనడమా?. అదే  టైమ్ లో మేలో కొన్ని స్కీములు అమలు చేస్తామని అంటారు.

ఈ సభకు  అంతా రావాలని దారిలో కనిపించిన వారినల్లా కోరుతూ ముఖ్యమంత్రిగా ఆయన మరో సంప్రదాయం నెలకొల్పారు. ప్రజలు తన సభకు రావడం లేదనో, లేక వచ్చినా వెళ్లిపోతున్నారనో ఇలా దండోరా వేసినట్లుగా చెప్పి ఉండాలి. అలా వచ్చిన వారిలో ఒక యువకుడు తన అర్జీని ఇవ్వబోతే మాత్రం అతనిని వేరే రాజకీయ పార్టీ వ్యక్తి అని, అతని సంగతి తమ వాళ్లు చూసుకుంటారని బెదిరించడం ఏమిటో అర్థం కాదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ కాలం పూర్తి అయ్యే సరికి ప్రజలు ఇంకెన్ని అసత్యాలను  వినాలో!.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement