ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్టు.... | Kommineni Srinivasa Rao Sensational Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్టు....

May 6 2026 10:13 AM | Updated on May 6 2026 10:48 AM

Kommineni Srinivasa Rao Sensational Comments On Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాలలో సొంతంగా ఎదిగి తన ప్రత్యేకతను చాటుకోవడంతో తనను తాను రుజువు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా? లేక స్వయంగా ప్రకాశించడమా?అన్నది తేల్చుకోవడానికి సిద్దమవుతారా?లేదా? అన్నదే ఇప్పుడు చర్చ. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని, అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ క్యాడర్ కు మింగుడుపడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్‌ లోకి వచ్చినవారు. కాని వీరిద్దరి మధ్య చాలా వత్యాసం ఉంది. 

విజయ్ ఇంతవరకు చిత్తశుద్దితో, ధైర్యంగా రాజకీయాలు చేస్తే, మొదటి నుంచి పవన్లో ఆ లక్షణాలు లోపించాయి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక  తెలుగుదేశం, బీజేపీలకు  మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, నిలదీస్తానని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది మాత్రం సున్నా. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా పూటకో చందంగా మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒకసారేమో 1800 ఎకరాలలో రాజధాని నిర్మించవచ్చని అన్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాల భూమి సేకరిస్తోందని రైతుల్లో వ్యతిరేకత వస్తే... వారికి మద్దతు పలికారు. 

ఆ వెంటనే హైదరాబాద్‌లో చంద్రబాబును కలవడమే తడవు మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయడంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు.చివరికి తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజికవర్గ రాజధానిగా మార్చుతోందని, గేటెడ్ కమ్యూనిటీ అయిందని కూడా విమర్శించారు. కాని 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని అదికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయి, చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊ కొడుతున్నారు.పైగా వేల ఎకరాల  అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడూ ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ, రహస్య సంబంధాలు కొనసాగించారన్న  ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల  అభ్యర్ధులను  నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజయ్ అలా చీకటి బంధాలకు  తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు.ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు.అనూహ్యంగా 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్  భయపడిపోయారు. వెంటనే చెగువేరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమలాడుకుని మళ్లీ పొత్తు  పెట్టుకున్నారు.తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నానని ఆయనే  చెప్పారు.

తన తల్లిని దూషించిన టీడీపీ  వారిని క్షమించబోనని బీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరికాలంలో ఆ విషయాన్ని విస్మరించి, అదే టీడీపీ నేతలను తెగ పొగడడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు.  బీజేపీ విజయ్‌ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాని విజయ్ ఎక్కడా తన విధానాన్ని వీడలేదు. పవన్ కళ్యాణ్ అలాకాదు. వైఎస్సార్‌సీపీతో జతకలవలేదు కాని, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు అన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటి అవినీతి పార్టీ లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలామంది ఆయనకు కొన్ని సలహాలు  ఇచ్చారు.

 టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఏభై సీట్లు  అడగాలని, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలని సూచించారు. కాని తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా పది సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలాకాదు.తాను ఏది చెబితే దానికే కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తను గెలిచినా, ఓడినా, ఇలాగే ఉంటానని విజయ్  స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు  రెచ్చగొట్టారు.కనీసం కులభావన రావాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత తనకు కులం ఏమిటని ఆయనే  ప్రశ్నించారు. పైగా 15 ఏళ్లపాటు టీడీపీని మోయాలన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ, జనసేన క్యాడర్ పెట్టుకున్న  ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేకమంది ఇప్పుడు  ఈయన తమను ముంచేశారని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ , ఆ తర్వాత కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తమకు ఎక్కడ ఉందని క్యాడర్ ను ప్రశ్నించి ఆశ్చర్యపరచారు. విజయ్ మాత్రం ఎక్కడా కులాలు, మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే  ప్రసంగాలు చేసేవారని  చెబుతారు.విజయ్ ఏ మీడియాపైన ఆధారపడలేదు. 

పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా ను నమ్ముకుని  చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను సీఎంగా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడుగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. 

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్దం కోసం, టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తుంటే, విజయ్  మాత్రం సూత్రబద్దమైన రాజకీయాలు  చేసేందుకు యత్నిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్లే  రజనీకాంత్, కమల్ హసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే, మంచి పాలోయింగ్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లో చిత్తశుద్ది లోపం,స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై  ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారన్నది పలువురు  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement