కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్‌ 1 

Kakinada Anchorage Port Gets Top Place In Rice Export - Sakshi

కాకినాడ యాంకరేజి పోర్టు దూకుడు

ఆఫ్రికన్‌ దేశాలకు భారీగా ఎగుమతులు

రవాణాలో బియ్యందే సింహభాగం

వ్యాపారులకు అనువైన సదుపాయాలు 

అందుబాటులో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు, రైలు రవాణా

నిల్వకు తగ్గినన్ని గోదాములు

ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందంజ 

Kakinada Anchorage Port బియ్యం ఎగుమతులకు కాకినాడ యాంకరేజ్‌ పోర్టు కేరాఫ్‌ ఆడ్రస్‌గా నిలించింది. ఆఫ్రికా దేశాలకు ఎగుమతుల విషయంలో దేశ వ్యాప్తంగా ఉన్న 22 మేజర్, 205 నాన్‌మేజర్‌ పోర్టుల్లో ఈ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలకత్తా, నెల్లూరు, వైజాగ్‌ తదితర పోర్టుల నుంచి కొంత మేర ఎక్స్‌పోర్ట్‌ అవుతున్నా.. 90 శాతం ఎగుమతి అవుతున్న జాబితాలో కాకినాడ పోర్ట్‌ నిలించింది. ఇక్కడి నుంచి  ఏటా రూ.వందల కోట్లు విలువ చేసే సరుకు (బియ్యం, సిమెంట్‌) ఎక్స్‌పోర్ట్‌ అవుతుంటాయంటే అతిశయోత్తి కాదు. వ్యాపారులకు అవసరమైన రవాణా, గోడౌన్, లోడింగ్, అన్‌లోడింగ్‌ సదుపాయం, కార్మికులు అందుబాటులో ఉండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు.
 – సాక్షి, కాకినాడ

ఇదీ సంగతి  
తూర్పు గోదావరి జిల్లాలో సుదీర్ఘ సాగతీరం ఉంది. సముద్ర రవాణాకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి తీరంలో రెండు పోర్టులున్నాయి. కాకినాడ యాంకరేజి పోర్టు ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల శాఖ పర్యవేక్షణలో ఉంది.కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు(సీ పోర్టు) ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది. వీటిలో యాంకరేజి పోర్టు నుంచి బియ్యం దక్షిణాఫ్రికా దేశాలకు, సిమెంటు పోర్డుబ్లెయిర్, అండమాన్‌కు ఎగుమతి చేస్తుంటారు. సీ పోర్టు నుంచి గ్రానైట్‌ బ్లాకులు, సిమెంటు, పంచదార, లాటరైట్‌ తదితర నిల్వలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం, పాస్పరిక్‌ యాసిడ్, వంటనూనెలు దిగుమతి అవుతుంటాయి.  

ఏటా రూ.కోట్లలో ఎగుమతులు
కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి  ఏటా కోట్ల రూపాయల విలువ చేసే సరుకు సౌతాఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,104 కోట్లు విలువ చేసే 28,21,222 మెట్రిక్‌ టన్నుల సరుకు ఎగుమతి చేశారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.49.87 కోట్ల ఆదాయం సమకూరింది. ఎగుమతి సరుకులో ఒక్క  బియ్యమే 27,91,769 మెట్రిక్‌ టన్నులు. సిమెంట్‌ 29,453 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల వ్యవధిలోనే 11,20,140 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 23,610 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ ఎగుమతి  చేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.11.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు పోర్టు అధికారులు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఐదు మైనర్‌ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్లు ఆదాయం రాగా.. అందులో కాకినాడలో పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది.  

ప్రభుత్వ ప్రోత్సాహం 
గతేడాది కరోనా కారణంగా ఎగుమతులు భారీగా తగ్గాయి. రోజుకు 10 వేల మంది కూలీలు పోర్టులో పని చేయాల్సి ఉండగా 3 వేల మంది మాత్రమే హాజరయ్యేవారు. వెరసి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి బియ్యం రవాణాకు అవరోధం ఏర్పడింది. ఈసారి ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మినహాయింపు ఇవ్వడంతో బియ్యం ఎగుమతులు ఊపందుకున్నాయి.   

అనుకూల వాతావరణం 
∙జిల్లాలో బియ్యం ఎగుమతులు చేసే వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉంది. 
∙ఎక్కువ శాతం బియ్యం ఛత్తీస్‌గడ్‌ నుంచి కాకినాడ పోర్టుకు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి పోర్టుకు రవాణా చేసేందుకు అవసరమైన రైల్వే వ్యాగన్‌ సదుపాయం ఉంది. 
∙సరుకు లోడింగ్, అన్‌లోడింగ్‌కు అవసరమైన హమాలీలు అందుబాటులో ఉంటారు. 
∙ముడిసరుకు ఉత్పత్తి చేసేందుకు (ధాన్యం ఆడించేందుకు) అవసరమైన బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు పుష్కలంగా ఉన్నాయి. 
∙ఎక్కడా లేని విధంగా 117 మిల్లులు పదుల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. 
∙బియ్యం ఆడిన తర్వాత ఎగుమతికి జాప్యం జరిగినా సరుకు నిల్వకు వేల సంఖ్యలో గోదాములున్నాయి. ప్రధానంగా సముద్రంలో స్టీమర్‌కు లంగరు వేస్తే నెల రోజులైనా.. అక్కడే సురక్షితంగా ఉంచే సౌకర్యం ఉండటం అనూలించదగ్గ విషయం. 
∙సరుకు రవాణాకు లారీలు ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top