అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కాంతారావు

Justice R Kantha Rao Fires On Institutions Over Charge High Fees In Amravati - Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థుల  తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రంలోని విద్యాసంస్థల హెచ్చరించినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్, ప్రభుత్వాలు ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆసహనం వ్యక్తం చేశారు. (చదవండి: విద్యార్థుల అభీష్టమే ఫైనల్)

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని విద్యాసంస్థలను హెచ్చరించారు. మరోవైపు మార్చి నెల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని డీఈఓలు, ఆర్జేడీలు, ఆర్ఐవోలు ఆయన సూచించారు. (చదవండి: నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!)

తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఫిర్యాదుల చేయోచ్చని చెప్పారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top