నేటి నుంచి జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు

JEE Main second phase exams from today - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 20 సెంటర్లలో నిర్వహణ

నాలుగు రోజులకు బదులు మూడు రోజులకు కుదింపు

సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ‘నో’

అడ్మిట్‌ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డు తప్పనిసరి 

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) మెయిన్‌ రెండో విడత (మార్చి సెషన్‌) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో  ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్‌ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ  మూడ్రోజులకు కుదించింది.

పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్‌ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్‌లో శానిటైజర్‌ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్‌ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్‌ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్‌ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్‌ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్‌ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top