జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా! | Jana Sena Party Meeting Turns Tense in Tirupati: AP | Sakshi
Sakshi News home page

జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!

May 10 2026 6:14 AM | Updated on May 10 2026 6:14 AM

Jana Sena Party Meeting Turns Tense in Tirupati: AP

సమావేశంలో వాదులాడుకుంటున్న జనసేన నాయకులు, కార్యకర్తలు

కార్యకర్తలకు స్పందించని నాయకులు వద్దంటూ నినాదాలు 

ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులను మార్చాలని డిమాండ్‌  

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల సమావేశంలో జనసేన శ్రేణుల నిలదీత 

స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై తిరుపతిలో జనసేన సమావేశం 

సీనియర్‌ నేతల సమక్షంలోనే నాయకులు, కార్యకర్తల మధ్య రచ్చ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్‌ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్‌ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్‌చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. 

ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం 
ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్‌ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, విజయ్‌ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్, విజయ్‌కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక 
సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు.  

జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా 
కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement