
తూర్పు గోదావరి జిల్లా: జనసేన నాయకుల ప్రచార ఆర్భాటానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. మమ్మల్ని ఎవర్రా అడిగేది అంటూ నిసిగ్గుగా ప్రభుత్వం అమలు చేయని పథకాన్ని కూడా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, రాష్ట్ర మంత్రి దుర్గేష్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలలో ప్రభుత్వ అమలు చేయని పథకాన్ని కూడా ముద్రించారు.
సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటూ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటూ ఫ్లెక్సీలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిని చూసి పట్టణ ప్రజలు, ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి నాయకులు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఈ పథకం అమలు చేస్తున్నట్టు ఫ్లెక్సీలో ముద్రించడం హాస్యాస్పదంగా మారింది. మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ఈ వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.