కులాలు, మ‌తాల‌తో డేంజ‌ర‌స్ గేమ్‌ | Jada Sravan Kumar Questioned Kutami Govt Over Caste And Religion Politics, Watch Key Pressmeet Video Inside | Sakshi
Sakshi News home page

కుల, మతాల మధ్య కూట‌మి ప్ర‌భుత్వం చిచ్చు

Mar 31 2026 7:37 PM | Updated on Mar 31 2026 7:51 PM

Jada Sravan Kumar questioned Kutami govt on religion politics

జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఫైర్‌
 

సాక్షి, విజ‌య‌వాడ‌: ఏపీలో కూటమి ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమ‌ర్శించారు. కొంతమంది మూర్ఖుల ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కారణమవుతోంద‌ని ఆరోపించారు. కులాలు, మ‌తాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం డేంజ‌ర‌స్ గేమ్ ఆడుతోంద‌న్నారు. కులాలు, మతాల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయోగం చేస్తోందని మండిప‌డ్డారు. మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లేసి గద్దెనెక్కించిన ప్రజలపై ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం ఆశించి కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సూటిగా ప్ర‌శ్నించారు.  

''2014- 19 , 2019-24 మధ్య ప్రభుత్వాల్లో ఏపీలో ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీలో కుల, మత ఘర్షణలు మొదలయ్యాయి. రెండు కులాలు, రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలనే దుర్మార్గకరమైన ప్రయోగం చేస్తున్నారు. కులాలు, మ‌తాలను ముడిపెట్టి రాజ‌కీయం చేయ‌డం రాష్ట్రానికి మంచిది కాదు. ఒక కులం వారు ఓటేయడం వల్లే మీకు 164 సీట్లు వచ్చాయా? ఆకువీడు ఘటన అత్యంత దురదృష్టకరం. అంతకంటే దురదృష్టకరమైన ఘటన తిరుపతి లడ్డూపై కల్తీ ప్రచారం. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని 6 నెలల పాటు చేసిన యాగీ ఎవరూ మర్చిపోలేదు. నిజమైన వెంకటేశ్వరస్వామి భక్తుడైతే చంద్రబాబు ఇలా చేసేవాడు కాదు. కానీ చంద్రబాబు భక్తుడి కంటే పొలిటీషియన్‌గానే వ్యవహరించారు. లడ్డూ ప్రసాదంపై, హిందూ సమాజంపై చంద్రబాబు తీవ్రమైన దాడి చేశారు. లడ్డూపై ప్రచారం చేస్తూనే క్రిస్టియన్లు, ముస్లింలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మ గౌరవంతో మొదలైన టీడీపీని చంద్రబాబు అధోగతి పాలు చేసే స్థాయికి తెచ్చారు. 

డిప్యూటీ స్పీకర్లు, స్పీకర్ల స్థానంలో ఉన్న వ్యక్తులు.. క్రిస్టియానిటీ, ఎస్సీలపై వ్యవస్థీకృతమైన దాడి చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చేస్తున్న దాడికి టీడీపీ సమాధానం చెప్పాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చంద్ర‌బాబు ఇచ్చిన అలుసు కార‌ణంగానే రఘురామ కృష్ణంరాజు రెచ్చిపోతున్నార‌ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మీరు ఇచ్చిన అలుసు కారణంగానే పోలీసులు రఘురామ కృష్ణంరాజుకు ఊడిగం చేస్తున్నారు. కుల మతాలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ఆద్యులు. క్రిస్టియన్లు, ముస్లింలు ఓటేయకుండానే మీకు 164 సీట్లు వచ్చాయా? మీకు ఓట్లేసిన పాపానికి క్రిస్టియన్లు, ముస్లింలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా?

నన్ను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుకు సంస్కారం లేదు. నీ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడటానికి నాకు రెండు నిమిషాలు పట్టదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శకుని పాత్రకు సరిగా సరిపోతాడు. ఆకువీడులో రఘురామకృష్ణంరాజు మొదలుపెట్టిన డేంజరస్ క్రీడ టీడీపీ పునాదులను కదిలించడానికే.  ఉండి నియోజకవర్గంలో ఎస్సీలు, క్రిస్టియన్లు ఓటేయకుండానే నువ్వు గెలిచావా? ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ , బీసీలు ఓటేయకుండానే మీకు భారీ మెజారిటీలు వచ్చాయా? రఘురామ కృష్ణంరాజు ఒక మతంపై దాడి చేస్తుంటే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏం చేస్తున్నారు? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దళితుడు కాబట్టి నోటీసులిచ్చారు. రఘు రామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కాబట్టి అతను ఏం చేసినా వంత పాడుతున్నారు. 

రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగిపోయిందని చంద్రబాబు, పవన్ హడావిడిగా ఖండించారు. మరి దళితులపై జరిగిన దాడులు మీకు కనిపించవా? పి.గన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే ఖండించడం మీకు చేతకాదా? కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ మునిగిపోవడం ఖాయం. హిందూత్వ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దుర్మార్గపు ఆలోచన మీది. మీరు ఎన్ని కుట్రలు చేసినా హిందు, ముస్లిం, మైనార్టీలు ఒక్కటే. కులమతాల మధ్య గొడవలు పెట్టే మిమ్మల్ని ప్రజలు నమ్మర''ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement