
సాలూరు: జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత? అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి బుధ వారం హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ ఊరిలో, ప్రతీ పాఠశాలలోని పిల్లలు జ్వరాలు, పచ్చకామెర్లతో బాధ పడుతున్నారన్నారు.
ఇది వాస్తవమన్నారు. తాను కూడా గత వారంలో రోజు లుగా జ్వరంతోనే బాధపడుతున్నానని.. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఎవరికైనా జ్వరం వస్తే తానెలా బాధ్యత వహిస్తానని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు పచ్చకామెర్లతో మృతిచెందగా.. జ్వరాలు, వివిధ ఆరోగ్య సమస్యలతో మరో 13 మంది విద్యార్థులు మరణించారు.
దీనిపై గిరిజన, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. మంత్రిని కూడా నిలదీశాయి. దీనికి ఆమె సమాధానం చెప్పకుండా, పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు కృషిచేస్తానని కూడా పేర్కొనకుండా, జ్వరాలు సోకితే తనదెలా బాధ్యతంటూ మంత్రి సంధ్యారాణి మీడియా సాక్షిగా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై గిరిజన, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు.