విద్యుత్ పంపిణీ సంస్థల్లో సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణలో అవకతవకలు
ప్రతి జిల్లాలోనూ అమాయకులను బలిచేసిన ప్రజాప్రతినిధులు
అధికారుల మాటలు నమ్మి మోసపోయిన కింది స్థాయి ఉద్యోగులు
రాజమహేంద్రవరంలో జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
తమనూ మోసం చేశారంటూ బయటకొస్తున్న ఇతర డిస్కంల బాధితులు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలో జరిగిన అక్రమ బదిలీలపై ‘విద్యుత్ సర్కిల్‌లో వెన్నుపోటు షాక్’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఇతర డిస్కంలలోనూ ఇదే విధంగా తమకూ అన్యాయం జరిగిందంటూ బాధితులు బయటకు వస్తున్నారు. మరోవైపు సాక్షి కథనంపై ‘ఏపీఈపీడీసీఎల్’ కూడా స్పందించింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం నుంచి ఉద్యో గుల కేటాయింపు జరిగిన విధానంపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
అక్కడంతా ఆయన ఇష్టమే
రాజమహేంద్రవరం నుంచి పాడేరు సర్కిల్‌కు ఉద్యోగుల కేటాయింపు వ్యవహారంలో ఒక యూనియన్ నేత చక్రం తిప్పారని, జిల్లా స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు అందరినీ ఆ నేత ‘మేనేజ్’ చేశారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంస్థ సీఎండీ, డైరెక్టర్లను తప్పుదోవ పట్టించడంలో జిల్లా అధికారి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఉద్యోగ సంఘానికి కీలక నేతగా ఉండటంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం ఇతని ప్రవృత్తి అని, దీనికి ఉన్నత స్థాయి అధికారులు కూడా సహకరించడంతో బదిలీలు దగ్గర్నుంచి, కారుణ్య నియామకాల వరకూ ఇతను చెప్పినదే వేదం, పెట్టిందే నియమం అన్నట్లు సర్కిల్‌లో పరిపాలన సాగుతోందని చెబుతున్నారు. డిస్కంలో ఇంత జరుగుతున్నా సీఎండీగానీ, విజిలెన్స్ విభాగంగానీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మమ్మల్నీ మోసం చేశారు
ఏపీఈపీడీసీఎల్‌లో సర్కిళ్ల ఉదంతం వెలుగులోకి రాడంతో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని బాధితులు బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా నుంచి సీఆర్‌డీఏకి ఇద్దరు లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు లైన్‌మెన్లు, ముగ్గురు జూనియర్ లైన్‌మెన్లను సర్కిళ్ల విభజనలో భాగంగా కేటాయించారు. ఇది తాత్కాలికమేనని వారికి చెప్పారు. కానీ తాజాగా అక్కడే ఉండాలని, మిమ్మల్ని శాశ్వతంగా సీఆర్‌డీఏకి కేటాయించేశామని ఆదేశాలిచ్చారు. పనిభారం కూడా ఎక్కువగా ఉందని, సరిపడా సిబ్బందిని వేయకుండా తమను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు.
సీనియర్లకు ప్రాధాన్యమిచ్చాం
ఆపరేషన్ సర్కిల్స్ పరిధిలో ఉన్న సెక్షన్లు ఆధారంగా పోస్టులు, సిబ్బంది కేటాయింపు చేపట్టినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ తెలిపారు. సర్కిళ్లలో ఉద్యోగుల కేటాయింపుల్లో అవకతవకలపై రాసిన ‘సాక్షి’ కథనంపై ఆయన మంగళవారం స్పందించారు. పునర్విభజనలో భాగంగా నిడదవోలు డివిజన్ నుంచి వచ్చిన పోస్టులు, సిబ్బంది రాజమహేంద్రవరంలో కలవడం, అప్పటికే రాజమహేంద్రవరం, విశాఖపట్టణంలో మంజూరైన పోస్టులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిబ్బంది విభజన చేసినట్లు ఆయన వివరించారు.
సీనియర్ ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చి సిబ్బంది కేటాయింపు చేశామని సీఎండీ వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లకు మినహాయింపులు ఇవ్వలేదన్నారు. సిబ్బంది పునర్విభజన ఏ విధమైన అవకతవకలు లేకుండా 2 కమిటీల పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగిందని, ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని సీఎండీ వివరించారు.


