IRCTC: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తత్కాల్‌ టికెట్స్‌పై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

IRCTC Special Focus On Bulk Tatkal Railway Tickets - Sakshi

IRCTC Tatkal Tickets.. సాక్షి, అమరావతి: ఈ–టికెట్ల బుకింగ్‌ విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తత్కాల్‌ టికెట్లలో బల్క్‌ బుకింగ్‌ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. దీనిపై సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌తో కలసి రూపొందించిన నివేదికను రైల్వే శాఖకు ఐఆర్‌సీటీసీ సమర్పించింది. రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో సమూల సంస్కరణలు తీసుకువస్తూ.. అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. 

దారి మళ్లుతున్న 35 శాతం తత్కాల్‌ టికెట్లు.. 
రైల్వే శాఖ ఈ–టికెటింగ్‌ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్‌ టికెట్లను కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఫేక్‌ ఐడీలతో అక్రమంగా బల్క్‌ బుకింగ్‌ చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ నియమించిన గ్రాంట్‌ థాంటన్‌ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. తత్కాల్‌ కోటాలోని దాదాపు 35 శాతం టికెట్లు ఇలా దారిమళ్లుతున్నట్టు తేలింది. దీంతో బల్క్‌ బుకింగ్‌ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఈ–టికెటింగ్‌ పోర్టల్‌లో సంస్కరణలు తీసుకువచ్చి అప్‌గ్రేడ్‌ చేయనుంది. అలాగే ఈ–టికెట్లకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ సామర్థ్యాన్ని కూడా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 

2021 డిసెంబర్‌ నాటి గణాంకాల ప్రకారం 80.5 శాతం రైల్వే టికెట్లు ఈ–టికెటింగ్‌ విధానంలోనే బుక్‌ చేస్తున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లలోని కౌంటర్ల వద్ద కంటే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ ద్వారా మూడు రెట్లు అధికంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఇప్పటివరకు 10 కోట్ల మంది నమోదు చేసుకోగా.. వారిలో 7.50 కోట్ల మంది ఈ–టికెట్ల కొనుగోలులో క్రియాశీలకంగా ఉంటున్నారు. 

2014లో అప్‌గ్రేడ్‌ చేసిన ఐఆర్‌సీటీసీ పోర్టల్‌కు సగటున నిమిషానికి 28 వేల లావాదేవీలు సాగించే సామర్థ్యముంది. కానీ గత ఎనిమిదేళ్లలో డిమాండ్‌ అమాంతం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సేవలు అందించేందుకు పోర్టల్‌ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే పోర్టల్‌సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. నిమిషానికి 40 వేల వరకు లావాదేవీలు సాగించే సామర్థ్యంతో పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్‌ కల్లా అప్‌గ్రేడ్‌ చేసిన పోర్టల్‌ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి.  

ఇది కూడా చదవండి: AP: హెచ్‌ఆర్‌సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top