ISRO@60: ఆకాశంతో పోటీ.. నాకెవ్వరు సాటి! 

Indian Space Research Organization has completed 59 years - Sakshi

తొలి ప్రయోగం నైక్‌ అపాచి రాకెట్‌ 

తొలి ఉపగ్రహం ఆర్యభట్ట   

బాహుబలి ప్రయోగాలకూ వేదికైన వైనం 

శాస్త్రవేత్తల అవిరళ కృషి శ్లాఘనీయం 

సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్షపరిశోధనా సంస్థ స్థాపించి 59 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. 1961లో డాక్టర్‌ హోమీ జహంగీర్‌ బాబా అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చిగా ఆవిర్భవించింది.

ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (టీఈఆర్‌ఎల్‌ఎస్‌)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్‌ 21న ‘నైక్‌ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్‌ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్‌ 20న రోహిణి–75 అనే సౌండింగ్‌ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది.  

తూర్పు తీర ప్రాంతాన.. 
దేశానికి మంచి రాకెట్‌ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్‌ విక్రమ్‌ సారాబాయ్, స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్‌ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట దీవి కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్‌ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్‌ రాకెట్లు ప్రయోగించారు. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్లతో 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలు, 13 స్టూడెంట్‌ ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు, మూడు గ్రహాంతర ప్రయోగాలు, రెండు ప్రయివేట్‌ ప్రయోగాలు చేశారు.  

ఆర్యభట్ట ఉపగ్రహంతోనే మొదటి అడుగు 
1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. 
►శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్‌ఎల్‌వీ–3 ఇన్‌1 పేరుతో రాకెట్‌ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.  
►1980 జూలై 18న ఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 
►ఆ తరువాత జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఐదు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు ఉపయోగపడేలా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ –3 రాకెట్‌ను రూపొందించారు.  
►ఆరు రకాల రాకెట్‌ల ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు అస్ట్రోశాట్స్, ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్థం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు) గ్రహాంతర ప్రయోగాలు (చంద్రయాన్‌–1, మంగళ్‌యాన్‌–1, చంద్రయాన్‌–2) లాంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు.  

వాణిజ్యపరమైన అభివృద్ధి వైపు పయనం 
►1992 మే 5న వాణిజ్యపరంగా పీఎస్‌ఎల్‌వీ సీ–02 రాకెట్‌ ద్వారా జర్మనీ దేశానికి చెందిన టబ్‌శాట్‌ అనే శాటిలైట్‌ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.  
►35 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు గుర్తింపు తెచ్చారు.  
►న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్, ఇన్‌ స్పేస్‌ అనే సంస్థలను ఏర్పాటు చేసి ప్రయివేట్‌గా ఉపగ్రహాలు, రాకెట్‌లను కూడా ప్రయోగించే స్థాయికి భారతీయ శాస్త్రవేత్తలు ఎదిగారు.  
►న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ వారి సహాయంతో ఇటీవలే ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌ ద్వారా వన్‌వెబ్‌ అనే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రయివేట్‌గా రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో పాటుగా గగన్‌యాన్‌–1, చంద్రయాన్‌–3, ఆదిత్య–ఎల్‌1 అనే చాలెంజింగ్‌ ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top