ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు

Published Mon, Aug 21 2023 3:37 AM

Increased Aarogyasree services in government hospitals - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగాని­కి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం నాడు­–నేడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసింది. మానవ వనరుల కొర­త లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చే­స్తోంది. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, తగినన్ని మందులు, ఇతర వనరులు సమకూ­ర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల­పై నమ్మ­కం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతోంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరో­గ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. దీంతో 2018–19లో 1,22,626 సేవ­లు మాత్రమే నమోదు కాగా 2022–­23లో ఏకంగా 4,42,929కు చేరాయి. దీంతో అదే మేర ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిధులు పెరిగాయి.

ఆరోగ్యశ్రీ కింద 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.­200 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందించగా.. గత సంవత్సరం ఈ మొత్తం ఏకంగా రూ.350 కోట్ల­కు పెరిగింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో ఆరోగ్యశ్రీ కింద అత్యధిక సేవ­లు అందిస్తూ విశాఖపట్నంలోని కేజీ­హెచ్‌ రాష్ట్రం­లోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వా­త విజయవాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి.  

ప్రభుత్వాస్పత్రుల వాటా పెంచడానికి ప్రత్యేక చర్యలు..  
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు తావులేకుండా ఏకంగా 50 వేలకు పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఎప్పుడు ఖాళీ అయిన పోస్టులను అప్పుడే వెంటనే భర్తీ చేస్తోంది. దీనికి తోడు నాడు–నేడు కింద ఆస్పత్రులకు కొత్త భవనాలు సమకూర్చడంతో పాటు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టింది.

అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్‌ థియేటర్‌లను తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్యను వీలైనంత తగ్గించాలని వైద్య శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను గణనీయంగా పెంచడం ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడంపై దృష్టి సారించింది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద నమోదవుతున్న వైద్య సేవల్లో 69 శాతం మేర ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో, 31 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల వాటాను మరింతగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.   

సేవల పెంపునకు ప్రత్యేక చర్యలు.. 
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మరింత పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలకు ఇన్సెంటివ్‌ నిధుల చెల్లింపునకు చర్యలు చేపట్టాం.   – ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్, సీఈవో,  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 

గతంతో పోలిస్తే మెరుగుపడ్డ సేవలు.. 
బోధనాస్పత్రుల్లో ఆరో­గ్యశ్రీ సేవలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డా­యి. వీటిని మరింతగా పెంచడానికి ఆస్పత్రులకు విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. గతేడాది నిర్వహించిన కేసుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం ఎక్కువ కేసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  – డాక్టర్‌ నరసింహం, డీఎంఈ

ఆరోగ్యశ్రీ సేవలు వేల నుంచి లక్షల్లోకి.. ఇక వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 2018–19తో పోలిస్తే వేల నుంచి ప్రస్తుతం లక్షల్లోకి పెరిగాయి. అప్పట్లో ఏడాదికి 16 వేలు మాత్రమే ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు ఉండేవి. వీటికి సంబంధించి నిధుల వాటా కేవలం రూ.34.94 కోట్లు మాత్రమే ఉండేది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వినూత్న మార్పు­లు చోటు చేసుకున్నాయి. 2022–23లో ఏకంగా రూ.151 కోట్ల విలువ చేసే వైద్యాన్ని 2.05 లక్షల కేసుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించారు.  
 

 
Advertisement
 
Advertisement