
ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో అరెస్ట్
పల్నాడు జిల్లాలో ఘటన
నరసరావుపేట టౌన్: సీసీఎస్ ఎస్సైనని, తక్కువ ధరకు రికవరీ బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ మహిళలను వంచిస్తున్న నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ మోసగాడి గురించి సేకరించిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన మేకల సాయికుమార్ తన పేరును ట్రూ కాలర్‌లో క్రైమ్ ఎస్‌ఐ విజయ్‌గా వచ్చేలా చేసి, మహిళా ఉద్యోగులు టార్గెట్‌గా ఫోన్లు చేస్తాడు. కాల్ చేసిన వెంటనే తాను ఎస్‌ఐ అంటూ పరిచయం చేసుకుని మాటలతో మభ్యపెడతాడు.
కొన్ని రోజుల తర్వాత దొంగతనం కేసులో బంగారం రికవరీ చేశామని, ఇందులో కొంత పక్కకు తీశానని చెబుతాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికి వారి నుంచి నగదు కాజేస్తాడు. మరికొందరికి బంగారాన్ని ఆశగా చూపి లోబర్చుకుంటాడు. ఆ తరువాత వారితో సన్నిహితంగా ఉన్న ఆడియో, వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడి డబ్బులు, బంగారాన్ని బలవంతంగా గుంజుకుంటాడు.
ఈ నేపథ్యంలో నరసరావుపేటకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు ఏడు మొబైల్స్ వినియోగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతని చేతిలో మోసపోయిన మహిళలు ఆరుగురు ముందుకొచ్చారని నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామకృష్ణ తెలిపారు.