నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగానం, మొలకలపొండ్ల గ్రామాల్లో అక్రమంగా క్వార్ట్‌జ్, మైకా తవ్వకాలు
సైదాపురం క్వార్ట్‌జ్, మైకా గనుల్లో మరో భారీ లూటీ
లీజు అనుమతులు రాకముందే అక్రమ తవ్వకాలు.. ఇప్పటికే 30 వేల టన్నుల ఖనిజం అక్రమంగా తవ్వకం
ఇందులో ఆంతర్యమేంటి? సదరు అమాత్యుడు ఎలా ఒప్పుకున్నారు
అటవీ.. పర్యావరణం తన ప్రాణమంటూ లెక్చర్లిస్తూ ఇలా ఎలా చేశారు?
ఈ దోపిడీలో రూ.వంద కోట్లు చేతులు మారిన వైనం.. నెల్లూరు ఎంపీ ముఖ్య అనుచరుడి ద్వారా సొమ్ము సమర్పణ
పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుకు పది రోజుల్లోనే మోక్షం
వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఈ ఒక్క ఫైల్ మాత్రమే క్లియర్
నట్టడవిలో తవ్వకాలకు అడ్డగోలుగా అనుమతులు
గతంలో భారీ పెనాల్టిలు పడిన అక్రమార్కుడికే మళ్లీ అప్పగింత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం ఏమాత్రం లేదని మరోమారు స్పష్టమైంది. ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకో.. పంచుకో.. అంటూ బరితెగిస్తోంది. నట్టనడి అడవిలో విలువైన ఖనిజాలను కొల్లగొట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తోంది. ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగోలేని, కనీసం ఫైన్ చెల్లించని సంస్థకు పెద్దపీట వేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ అటవీ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మైనింగ్ కుంభకోణాలకు అడ్డాగా మారింది.
తాజాగా చాగానం, మొలకలపొండ్ల గ్రామాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన మైకా, క్వార్ట్‌జ్ ఖనిజాలను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు రంగం సిద్ధం చేశారు. పర్యావరణ అనుమతులు (ఈసీ) రాకముందే, అధికారికంగా లీజు ఒప్పందం కుదరకముందే అక్కడ ఖనిజాలను యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేలం నిర్వహించకుండా ఈ అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అక్రమాలను సక్రమం చేసుకునేందుకు పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును ఇప్పుడు హడావుడిగా బయటకు తీసి, ఆగమేఘాల మీద క్లియర్ చేయించారు. అటవీ భూములను కాపాడాల్సిన వారే వాటిని అక్రమార్కులకు అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది.
పదేళ్ల నిద్ర.. పది రోజుల్లో మేల్కొలుపు
పదేళ్లు పెండింగ్‌లో ఉన్న ఈ లీజు ఫైలుకు ఉన్నట్టుండి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక కీలక నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపురం మండలం చాగానంలో సర్వే నంబర్ 505, మొలకొలపొండ్లలో సర్వే నంబర్ 528లో 10.02 హెక్టార్లలో (25 ఎకరాలు) క్వార్ట్‌జ్, మైకా లీజు కోసం ది కృష్ణా మైనింగ్ కంపెనీ (మేనేజింగ్ పార్టనర్ భరత్) 2014 అక్టోబర్ 9న దరఖాస్తు చేసుకుంది. ఇది అటవీ భూమి కావడం, పర్యావరణ నిబంధనల ప్రకారం అక్కడ ఖనిజ తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో ఈ దరఖాస్తు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది.
కానీ 2024 అక్టోబర్ తర్వాత దీనికి అకస్మాత్తుగా రెక్కలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మైకా, క్వార్ట్‌జ్ వంటి ఖనిజాలను మేజర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి వాటికి బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజులు ఇవ్వాలని గెజిట్ ఇచ్చిన సమయంలోనే కూటమి ప్రభుత్వం తన పరిధిని వాడుకుంటూ పాత దరఖాస్తును క్లియర్ చేయడం గమనార్హం. 2025 నవంబర్ 3న జీఓ ఎంఎస్ నెంబర్ 64 జారీ చేసి అటవీ భూమి మళ్లింపునకు తుది అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా దరఖాస్తులు లెక్కనేనన్ని పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈ ఒక్క దరఖాస్తుకు మాత్రమే క్లియరెన్స్ లభించడం
ఇందుకు తార్కాణం.
గతంలో పట్టుబడ్డ అక్రమార్కుడికే మళ్లీ పట్టం
సాధారణంగా ప్రభుత్వానికి బకాయిలు ఉన్న కంపెనీలకు కొత్త లీజులు ఇవ్వకూడదు. కానీ కృష్ణా మైనింగ్ కంపెనీ గతంలోనే అక్రమ తవ్వకాలు జరపడంతో ప్రభుత్వం రూ.11.66 కోట్ల జరిమానా విధించింది. ఆ డబ్బు ఇప్పటికీ కట్టలేదు. అలాంటి బ్లాక్ లిస్టు కంపెనీకి మళ్లీ 10.02 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అప్పగించడం వెనుక నెల్లూరు జిల్లా అధికార పార్టీ పెద్దలతో పాటు ఉండవల్లి, మంగళగిరి పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం. 2025 డిసెంబర్ 16న జీఓ ఆర్‌టీ నెంబర్ 229 ద్వారా ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి కొత్తగా మారిన కేంద్ర చట్టాలను పక్కన పెట్టి పాత మైనర్ మినరల్ నిబంధనల కిందే వెసులుబాటు కలి్పంచారు.
లీజు రాకుండానే లూటీ
నిబంధనల ప్రకారం లీజు ఖరారైన తర్వాతే తవ్వకాలు జరగాలి. కానీ ఈ కంపెనీ ఇప్పటికే 20 వేల టన్నుల నుంచి 30 వేల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ ప్రాంతంలో ఉన్న లోతైన గుంతలే ఇందుకు నిదర్శనం. ఎన్జీటీ నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ భూముల మళ్లింపునకు అనుమతి ఇచ్చినా ఇంకా పర్యావరణ అనుమతులు (ఈసీ) రాలేదు. త్వరలో ఈసీ అనుమతి కోసం పబ్లిక్ హియరింగ్ జరగనుంది. కానీ ఈలోపే అక్రమార్కుల యంత్రాలు అడవిని తవ్వేస్తున్నాయి.

వందల దరఖాస్తులు పెండింగ్.. ఈ ఒక్కటి మాత్రమే క్లియర్
రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల్లో మైనింగ్ కోసం దాదాపు 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, అందులో ఒక్క నెల్లూరు జిల్లావే 80 దరఖాస్తులున్నాయి. ఇవి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఒక్క సంస్థ దరఖాస్తును మాత్రమే అత్యవసరంగా క్లియర్ చేశారు. అసలు అడవిని తవ్వడానికి తాను ఏమాత్రం ఒప్పుకోనని, పర్యావరణం అంటే తనకు ప్రాణమని లెక్చర్లిచ్చే నేత ఈ దందాకు ఎలా అంగీకరించారని సదరు శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. భారీగా ముడుపులు అందడం తప్ప మరేమీ కాదని ప్రచారం జరుగుతోంది.
వేల కోట్ల సంపద.. నామమాత్రపు లీజులు
సైదాపురం ప్రాంతంలో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఖనిజ సంపదకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం చాగానం, మొలకొలపొండ్లలో ఉన్న ఖనిజం విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుంది. కానీ గనుల శాఖ కేవలం రూ.9 లక్షల ప్రీమియం మాత్రమే కట్టాలని ఆ సంస్థకు డిమాండ్ నోటీసు ఇచి్చంది. ఈసీ రాక ముందే అటవీ భూమిని మళ్లించడం, వ్యవస్థలన్నీ ఆ కంపెనీ కోసం ఏకమై పని చేయడం చూస్తుంటే ఈ అక్రమాల వెనుక ఎంత పెద్ద లాబీయింగ్ ఉందో అర్థం చేసువకోవచ్చు. అటవీ భూమిని ఈ సంస్థకు దారాదత్తం చేయడం వెనుక రూ.100 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ నుంచి ఈ లీజును చేజిక్కించుకున్న నెల్లూరు ఎంపీ ప్రధాన అనుచరుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘ఉప’ నేతకు కూడా డబ్బు కొట్టి ఒప్పించినట్లు తెలిసింది.


