ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే.. | Sakshi
Sakshi News home page

ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..

Published Fri, Oct 14 2022 9:30 AM

ICDS And CWC Handed Over By The Baby To The Parents - Sakshi

అనంతపురం సెంట్రల్‌/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.  
అసలేం జరిగిందంటే...
సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్‌ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు.  
ఉత్కంఠకు తెర  
పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్‌ అధికారులను సంప్రదించాడు.

అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్‌ అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్‌ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్‌ పీడీ బీఎన్‌ శ్రీదేవి అప్పగించారు.  

శిశుగృహ సిబ్బందికి అభినందన 
తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్‌ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు.   

(చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం)

Advertisement
Advertisement