హాట్‌.. కూల్‌.. సోలార్‌ 

Hybrid solar air conditioners in market - Sakshi

మార్కెట్లోకి హైబ్రిడ్‌ సోలార్‌ ఎయిర్‌ కండీషనర్లు  

సాక్షి, అమరావతి: సూర్యరశ్మిలో ఉన్న అనంత శక్తిని వినియోగించుకోవడంపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అలాగే హైడ్రోజన్‌ గ్యాస్‌ను భవిష్యత్‌ ఇంధనంగా కూడా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సౌర శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చి వినియోగించుకుంటున్నాం. ఆ విద్యుత్‌తో దీపాలు వెలిగిస్తున్నాం.

వాహనాలను, పరిశ్రమలను కూడా నడుపుతున్నాం. వీటన్నింటినీ మించి తాజా ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి సోలార్‌ హైడ్రోజన్‌ ప్యానల్స్‌ కాగా, రెండవది హైబ్రిడ్‌ సోలార్‌ ఎయిర్‌ కండీషనర్లు. భవిష్యత్‌ తరాలకు భరోసా కల్పిస్తున్న ఈ రెండు కొత్త ప్రాజెక్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.  

ఇంటిపైనే హైడ్రోజన్‌ ఫ్యాక్టరీ.. 
పర్యావరణానికి హాని చేసే ఉద్గారాలు ఏమీ లేని స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్‌. ఈ గ్యాస్‌ను గాలి నుంచి పొందేలా బెల్జియంలో పరిశోధనలు సాగాయి. సూర్యుని నుంచి విద్యుత్‌ శక్తిని, గాలి నుంచి హైడ్రోజన్‌ వాయువును సంగ్రహించగల పైకప్పు (రూఫ్‌టాప్‌) ప్యానెల్స్‌ను కేయూ లీవెన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

చాలా కాలంగా వీరు చేసిన పరిశోధనలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రస్తుతం పారిశ్రామికోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. 2030కల్లా రూఫ్‌టాప్‌ హైడ్రోజన్‌ ప్యానల్స్‌ తయారు చేసేలా కృషి చేస్తున్నారు. హైడ్రోజన్‌ను నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్‌గా, రూమ్‌ హీటర్‌గా వినియోగించుకునేందుకు వారు ఈ ప్రాజెక్టును రూపొందించారు.

వీరు తయారు చేసిన ప్యానల్స్‌లో ఎలక్ట్రిక్‌ వైర్లకు బదులుగా గ్యాస్‌ ట్యూబ్లు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. ఈ ప్యానల్స్‌ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మారుస్తాయి. అలాగే గాలి నుంచి నీటి ఆవిరిని గ్రహిస్తాయి. సూర్యుని నుంచి గ్రహించిన శక్తిని వినియోగించి ఆ ప్యానల్స్‌ నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజిస్తాయి. హైడ్రోజన్‌ను స్టోర్‌ చాంబర్‌కు పంపి, ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇలా నిల్వ చేసిన హైడ్రోజన్‌ను శీతాకాలంలో రూమ్‌ హీటింగ్‌ సిస్టంకు, అలాగే గృహానికి విద్యుత్‌గా కూడా వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.   

సౌర, బ్యాటరీ, విద్యుత్‌తో పనిచేసే ఏసీ 
హైబ్రిడ్‌ సోలార్‌ ఎయిర్‌ కండీషనర్‌ను  సోలార్‌ ఏసీగా పిలుస్తున్నారు. వీటిని సౌరశక్తి, సౌర బ్యాటరీ బ్యాంక్, విద్యుత్‌తో పనిచేయించవచ్చు. అంటే కరెంటు, సూర్యరశ్మి లేకున్నా  ఏసీ ఆగదు. సోలార్‌ ప్యానల్స్, సోలార్‌ ఇన్వర్టర్లు, అన్ని ఉపకరణాలతో కలిపి ఏసీని తయారు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top