
యానాంకు కూడా ప్రమాదం ఉందన్న ఐఎండీ
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం
నేడు, రేపు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావం రాష్ట్రంపై భారీగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్స్) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శుక్రవారం మధ్యాహ్నంలోపు కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీనికనుగుణంగా ఆయా ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కొనసాగుతున్న అల్పపీడనం
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని, శుక్రవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని, అనంతరం పశి్చమ వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. బిలాస్‌పూర్, కళింగపట్నం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. కాగా, 16 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
వేటకు వెళ్లొద్దు
రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకు కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలను అప్రమత్తం చేస్తూ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపిస్తుందని ఆయన స్పస్టంచేశారు.
తణుకులో 240 మి.మీ. వర్షపాతం
గడిచిన 24గంటల్లో తణుకులో 240 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, నందిగామలో 190, తాడేపల్లిగూడెంలో 160, విజయవాడ, అమలాపురం, డెంకాడలో 130, పాలేరులో 120, భీమడోలులో 100, పూసపాటిరేగ, ఏలూరులో 90, తుని, విజయనగరం, పాలకోడూరులో 80 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.