నిరుడు అక్టోబరులో రూ.3,815 కోట్లు
ఈ ఏడాది రూ.3,490 కోట్లకు పరిమితం
దేశవ్యాప్తంగా రెండు శాతం పెరుగుదల
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబరు నెలలో తొమ్మిది శాతం క్షీణించాయి. శ్లాబ్ రేట్ల సవరణ తర్వాత దేశవ్యాప్తంగా రెండు శాతం వృద్ధి నమోదవగా ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో 10 శాతం చొప్పున, తమిళనాడులో 4 శాతం పెరుగుదల ఉండడం గమనార్హం.
రాష్ట్రంలో అక్టోబరు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే రూ.3,815 కోట్ల నుంచి రూ.3,490 కోట్లకు పడిపోయాయి. నికర వసూళ్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023తో పోలిస్తే తగ్గాయి. 2023 అక్టోబరులో రూ.3,098 కోట్లుండగా... ఈ ఏడాది అక్టోబరులో రూ.3,021 కోట్లకే పరిమితమయ్యాయి.
⇒ శ్లాబుల సవరణ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగ్గా ఒక్క ఏపీలోనే తగ్గాయి. అక్టోబరులో తెలంగాణ గ్రాస్ జీఎస్టీ వసూళ్లలో 10 శాతం వృద్ధి (రూ.5,211 కోట్ల నుంచి రూ.5,726 కోట్లకు) కనిపించింది. కర్ణాటకలో రూ.13,030 కోట్ల నుంచి రూ.14,395 కోట్లకు పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్ జీఎస్టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి.
⇒ ఏప్రిల్–అక్టోబరు మధ్య ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది కంటే కేవలం 2.7 శాతం పెరిగి రూ.27,059 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 7.8 శాతం వృద్ధి నమోదైంది.


