
ఏడాదిగా నాలుగు డీఏలు ఎగ్గొట్టిన సర్కారు
800 మందికి కారుణ్య నియామకాలు లేవు
కాంట్రాక్టు కార్మికులకు బకాయిలూ పెండింగ్
7686 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు అన్యాయం
కూటమి ప్రభుత్వంతో విసిగిపోయిన ఉద్యోగులు
23 తర్వాత నిరవధిక సమ్మె
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. డిమాండ్లను పరిష్కరించాల్సి వచ్చినపుడు ప్రత్యేక సంస్థ అంటూ వేరు చేసి, అనుకూలంగా పనిచేయాల్సి వచ్చినపుడు మాత్రం చాకిరీ చేయించుకుంటోంది. ఏడాది గడిచినా వారి కనీస డిమాండ్లను పరిష్కరించకుండా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15 నుంచి దశలవారీ ఆందోళనకు దిగారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొదలైన ఈ ఉద్యమం...23వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు
విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం, యాజమాన్యం ఎదుట పలు డిమాండ్లను ఉంచినా, వాటిలో ప్రధానంగా నాలుగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం డీఏ బకాయిలు పెట్టకుండా ఐదేళ్లూ క్లియర్ చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కూటమి సర్కారు వచ్చాక ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదు. దీంతో నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. తద్వారా శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని, డీఏలు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఏడాది కాలంలో చనిపోయిన 800 మంది ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కారుణ్య నియామకాలు ఒక్కటీ పూర్తి చేయలేదు. ఇంటి పెద్దను కోల్పోయి, కుటుంబ పోషణ కష్టమై 800 కుటుంబాలు అల్లాడుతున్నాయి. కారుణ్య నియామకాల కమిటీ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 7,686 మంది నిరుద్యోగులకు ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించింది. వారిని ఐదేళ్ల తరువాత జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం) కేడర్‌లో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో విలీనం చేయాలి.
అయితే, కూటమి సర్కారు పట్టించుకోవడంలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమల్లోకి వచి్చన 2004 నుంచి కాకుండా 1999 నుంచే పాత పెన్షన్ విధానాన్ని ఎత్తివేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) స్కీమ్‌ను విద్యుత్తు సంస్థల్లో అమలు చేస్తున్నారు. దీంతో 5,311 మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. వారికి న్యాయం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విసిగిపోయి ఉద్యమ బాట పట్టారు.
స్పందించకుంటే తీవ్ర ఉద్యమం
ఏపీ ట్రాన్స్‌కో, ఇంధన శాఖ, డిస్కంల యాజమాన్యాలతో పలుసార్లు చర్చలు జరిపినా, మినిట్స్ రూపంలో అంగీకరించినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. డిస్కంలు... కార్మిక చట్టాలు, విద్యుత్తు బోర్డు విభజనకు ముందు ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా 60 ఏళ్లుగా అమల్లో ఉన్న సర్వీస్ నిబంధనల్లో ఏకపక్షంగా మార్పులు చేస్తున్నాయి. దీంతో విసుగు చెంది తప్పని పరిస్థితుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాం. మా సమస్యలు పరిష్కరించకుంటే 23 తర్వాత ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతాం. –ఎస్.కృష్ణయ్య, చైర్మన్, రాష్ట్ర జేఏసీ
కాంట్రాక్టుకు ఇవ్వొద్దు..
ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్స్ రూపొందించాలి. మాస్టర్ స్కేలు గరిష్ఠ పరిమితితో నిమిత్తం లేకుండా వార్షిక, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలి. ఎంతోకాలంగా డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో నిర్వహిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఆపాలి – తురగా రామకృష్ణ, జేఏసీ కో చైర్మన్
వారి ఆశలు నెరవేర్చాలి
విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబసభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో అమల్లో ఉన్న జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ లేబర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేదంటే మా ఉద్యమం ఉధృతం అవుతుంది. తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – రాఘవరెడ్డి, జేఏసీ కన్వినర్
ఎనర్జీ అసిస్టెంట్లకు న్యాయం జరగాలి
దీర్ఘకాలిక సర్వీసున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ విద్యుత్ సంస్థలలో విలీనం చేయాలి. కారుణ్య నియామకాలు కల్పించడంలో పాత పద్ధతినే కొనసాగించాలి. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం (గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలి.’’ – కె.శేషారెడ్డి, జేఏసీ కో కన్వినర్