నేటి రాత్రికే గ్రామాలకు..

Gopal Krishna Dwivedi And Girija Shankar teleconference on election arrangements - Sakshi

ఎన్నికలకు సిబ్బంది రెడీ

ప్రత్యేక బస్సులు సిద్ధం చేయాలి

ఎన్నికల ఏర్పాట్లపై ద్వివేది, గిరిజా శంకర్‌ టెలికాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వతేదీన జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సహా ముందు రోజు రాత్రికే ఆయా గ్రామాలకు చేరుకునేలా జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బ్యాలెట్‌ పేపర్లు, స్వస్తిక్‌ మార్క్, రబ్బర్‌ స్టాంప్‌లు, ఇండెలిబుల్‌ ఇంకు తదితర సామాగ్రిని సిబ్బంది సోమవారం మధ్యాహ్నం కల్లా తీసుకుని ఆయా పోలింగ్‌ బూత్‌లకు చేరుకోవాలని, రిటర్నింగ్‌ అధికారులు, పీవోలు పోలింగ్‌ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ద్వివేది పేర్కొన్నారు. ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగే పక్షంలో తగినన్ని లైట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్‌ గిరిజా శంకర్‌ సూచించారు. సిబ్బందికి భోజనం తదితర సదుపాయాలను కల్పించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిఘా..
వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్‌ రూం ద్వారా వెబ్‌కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని గిరిజా శంకర్‌ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేందుకు నిక్షిప్తం చేయాలన్నారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వీటి కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఎంపీడీవోలకు పంపాలని జిల్లా అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపీడీవోలను కూడా మొదటి దశకు వినియోగించుకోవాలని కమిషనర్‌  సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top