
కాకినాడ జిల్లా ఎన్.సూరవరంలో స్థానికులతో మాట్లాడుతున్న మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఊరూరా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన గురించి, పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. ఇకపై కూడా ఇదే రీతిలో సంక్షేమాభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ‘ఇదివరకు ఏ ప్రభుత్వంలోనూ మేము ఇంతగా లబ్ధి పొందలేదు’ అని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ శనివారం 11వ రోజూ ప్రజలు అదే ఆదరణ చూపించారు.