
విద్యార్థులకు అస్వస్థత కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డ పిల్లలు
పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల(బాలుర)పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 25మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. శనివారం ఉదయం నుంచి కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. కేవలం రెండు బాత్‌రూంలే ఉండటంతో విద్యార్థులు నరకయాతన అనుభవించారు. ఈనెల 25న సాయంత్రం విద్యార్థులకు కారం బొరుగులు ఇచ్చారు. రాత్రి భోజనంలో అన్నం, దోసకాయ కూర, సాంబారు, మజ్జిగ వడ్డించారు. ఉదయానికి విద్యార్థులు అస్వస్థతకు గురవగా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
వీరంతా 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులే. కాగా, ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఐటీడీఏ పీఓ శివప్రసాద్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు కారణం బయటి ఆహారమా, లేక మునుపటి రోజు తిన్న ఆహారమా అనే కోణంలో విచారణ చేపట్టారు.
అనంతరం పాఠశాలకు వెళ్లి ఆవరణను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు పాఠశాల ముందున్న కాల్వ, బురద, ఇతర సమస్యలను గుర్తించారు. ఈనెల 25న వడ్డించిన ఆహార పదార్థాలు, అక్కడ అందిస్తున్న నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.