ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు 

Female drivers in APSRTC Buses Andhra Pradesh - Sakshi

ఎస్సీ మహిళలకు బస్‌ డ్రైవర్లుగా శిక్షణ 

అనంతరం ఆర్టీసీలోనే ఉద్యోగాలు  

తొలి దశలో 310 ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ 

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశారు.

సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. 

ఆర్టీసీలోనే పోస్టింగ్‌.. 
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తారు. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. 

నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మహిళలకు పదవులు, నామినేటెడ్‌ పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం.  శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్‌లాగ్‌  డ్రైవర్‌ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తాం. 
– మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top