
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కోల సీఈలు సభ్యులుగా ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు.
సమస్య –1: రూల్ కర్వ్‌పై తలో మాట
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది.
ఈ రూల్ కర్వ్‌పై ఆర్‌ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది.
సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు
సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది.
సమస్య–3: వరద జలాల మళ్లింపు..
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది.