కర్నూలు హంద్రీ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..
ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
క్షతగాత్రుడికి సపర్యలు చేస్తున్న పోలీసులు, హైవే మొబైల్, రోడ్డు సేఫ్టీ అధికారులు
సాయం చేసేందుకు ముందుకొచ్చిన మరో ఇద్దరు
అతివేగంతో వచ్చి ప్రమాద స్థలిలో ఉన్న వారిని ఢీకొట్టిన లారీ
ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు
ఏడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం
మద్యం తాగి లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం
కర్నూలు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి ప్రమాదం జరిగితే.. అతనికి సాయం చేద్దామని మానవత్వంతో స్పందించిన మరో ఇద్దరిని మృత్యువు వెంటాడింది. ఒకేచోట వెనువెంటనే జరిగిన ప్రమాదాలతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కర్నూలు నగరంలో బుధవారం జరిగింది.
వివరాలు.. కల్లూరు శివప్ప నగర్‌లోని శాంతినికేతన్ స్కూల్ వెనుక నివాసం ఉండే కుమ్మరి శేఖర్(28) మట్టి పెంకుల పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పి మాత్రలు తీసుకుని కృష్ణానగర్ వైపు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా హంద్రీ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సమాచారం అందడంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రఫీ, మరో కానిస్టేబుల్ సందీప్‌తో పాటు హైవే మొబైల్ సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో చెరుకులపాడు గ్రామానికి చెందిన చాకలి అజిత్ కుమార్(26), శరీన్‌నగర్‌కు చెందిన బండారు కన్నా(23) బైక్‌పై వెళ్తున్నారు.
ప్రమాదం జరిగిందని తెలిసి పోలీసులకు సహాయ పడుతున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న గ్రానైట్ లారీ ముందున్న ట్రావెల్స్ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఘటనా స్థలంలో నిలబడి ఉన్న జనం మీదకు దూసుకెళ్లింది. దీంతో బండారు కన్నా, అజిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బండారు కన్నా, చాకలి అజిత్‌కుమార్ మృతిచెందారు.
చాకలి అజిత్ కుమార్ రివైండింగ్ దుకాణంలో పనిచేస్తుండగా, బండారు కన్నా గౌండా పని చేస్తుస్తున్నాడు. మొదటి ప్రమాదంలో మృతిచెందిన కుమ్మరి శేఖర్‌కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు. మృతుడి తండ్రి మద్దిలేటి ఇచి్చన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాద ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ట్రాఫిక్ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ రఫీతోపాటు మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వా«దీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్టు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.


