దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే 

Fastest comprehensive land survey in country - Sakshi

ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలి 

గ్రామకంఠాల సమస్య పరిష్కారం 

రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన  

సాక్షి, అమరావతి: దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న భూ హక్కు–భూ రక్ష పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైంది.  ఉప సంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి పథకం ప్రగతిని సమీక్షించారు.

మంత్రులు మాట్లాడుతూ 2023 డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్‌ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు.

ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీల్లోనూ సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు.

భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్, సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థ్‌ జైన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సౌరబ్, మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top