శేషగిరమ్మ సమస్యను వింటున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ఐదు సెంట్ల భూమి, ఇంటిని సీఆర్‌డీఏ లాగేసుకుంది
భూమికి భూమి ఇస్తామని.. ఇంటికి పరిహారం ఇస్తామని నమ్మబలికింది
మేం అంగీకరించకుండానే మా భూమి తీసుకుంది
దీనిపై నా భర్త పోరాడి కేన్సర్‌తో చనిపోయారు
90 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేని మనవరాలితో బతుకీడుస్తున్నా
మాజీ సీఎం జగన్‌ను కలిసి గోడువెళ్లబోసుకున్న రాయపూడి వాసి నెల్లూరి శేషగిరమ్మ
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదని 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమైంది. సీఆర్‌డీఏ అధికారులు తనకున్న కాస్త భూమిని లాక్కుని జీవిత చరమాంకంలో అధోగతి పాల్జేస్తున్నారని గోడువెళ్లబోసుకుంది. మతిస్థిమితం లేని మనుమరాలితో అష్టకష్టాలు పడుతుంటే.. తన భూమిని వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని వాపోయింది. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను వెళ్లబోసుకుంది.
శేషగిరమ్మ దీనగాథను పరికిస్తే..
చంద్రబాబు భూ దాహం 90 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డున పడేస్తే.. బలవంతపు భూదోపిడీ ఆమె భర్తను మృత్యు ఒడిలోకి నెట్టేసింది. నెల్లూరి శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తమకున్న ఐదు సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. 2015లో సీఆర్‌డీఏ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని.. భూమికి భూమి ఇచ్చి, ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరి రావు (100ఏళ్లు)తో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు.
రెండేళ్ల తర్వాత శేషగిరమ్మ బ్యాంకు ఖాతాలో అత్యంత హీనంగా రూ.2,500 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త శేషగిరిరావు తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమకు కౌలు వద్దని, భూమిని వెనక్కి ఇవ్వాలని సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరిగి అలిసిపోయాడు. కేన్సర్‌తో బాధపడుతున్న అతడు మృతి చెందారు. కొంతకాలానికే కుమార్తె సైతం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందింది. అప్పటినుంచి మతిస్థిమితం లేని 40 ఏళ్ల మనుమరాలితో బిక్కబిక్కుమంటూ శేషగిరమ్మ ఒంటరి జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ దుర్నీతిపై కోర్టుకు వెళ్లిన వృద్ధురాలు తన భూమి తిరిగి ఇప్పించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసూ్తనే తనకు సాయం చేయాలని వైఎస్ జగన్‌ను కలుసుకుని గోడు వెళ్లబోసుకుంది. గతేడాది అక్టోబర్‌లో తన స్థలంలోని ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా.. ఫైర్ అధికారులు సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి, ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్నారైలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని.. తన భూమి తిరిగి వస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువలు కలిగిన వృద్ధురాలి నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని, వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిగా అండగా నిలుస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు భరోసా కల్పించారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీ నూతన బార్ కౌన్సిల్ సభ్యులు
న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించండి
∙ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు వైఎస్ జగన్ సూచన
∙కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని వైఎస్ జగన్ అభినందించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి, నూతన బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి(హైకోర్టు), రోళ్ల మాధవి(హైకోర్టు), కొవ్వూరి వెంకట్రావిురెడ్డి(హైకోర్టు), ఆలూరు రామిరెడ్డి(అనంతపురం), వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి(గుంటూరు), కృష్ణారెడ్డి బి.వి (ఏలూరు) పాల్గొన్నారు.


