
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలి.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదు
అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలి
ఎన్నికల ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘాలో జరగాలి
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ గురువారం కలిశారు.
గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమరి్పంచారు. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించాలని, నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు.
అభ్యర్థులను బెదిరిస్తున్నారు: గడికోట
స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నిజాయితీపరులు, సమర్థులైన అధికారులను నియమించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
పులివెందులలో బీటెక్ రవి అనే నాయకుడు ‘ఎవరు నామినేషన్ వేస్తారో చూస్తా’మంటూ నేరుగా ప్రెస్‌మీట్‌లో బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నామినేషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించాలి: మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి:
ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల కమిషనర్‌ను కోరామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వంపై ఓట్ల రూపంలో వ్యతిరేకత ప్రతిబింబించకుండా అడ్డుకోవడానికి కూటమి నాయకులు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారన్నారు. అభ్యర్థులు కనీసం నామినేషన్ కూడా వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే పూర్తి అధికారం ఇస్తే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు ఉండవని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కలగజేసుకుని పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరామన్నారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యరి్థకి పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశామనితెలిపారు.
ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరాం: దేవినేని అవినాశ్
ఇటీవల తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కారో రాష్ట్ర ప్రజలంతా చూశారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని గుర్తు చేశారు. లొంగని వారిని బెదిరించి, కిడ్నాప్ చేసి కూటమి వైపు తిప్పుకున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇలాగే అడ్డదారులు తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.