అసలు కిక్కు రామోజీకే!  | Sakshi
Sakshi News home page

అసలు కిక్కు రామోజీకే! 

Published Wed, Jun 29 2022 3:57 AM

Eenadu Fake News On Liquor making issue In Andhra Pradesh - Sakshi

రామోజీరావుకు వయసు పెరిగి బుద్ధి మందగిస్తున్న విషయం ‘ఈనాడు’ రాతల్లో స్పష్టంగానే కనిపిస్తోంది. వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతే తప్ప...తామేం రాస్తున్నామో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యంలో ఉంది ఆ పత్రిక. ఇంకా చెప్పాలంటే... ఇప్పటికీ ‘ఈనాడు’ను చదువుతున్న వారి దౌర్భాగ్యమది. పాఠకుల తెలివితేటల పట్ల ‘ఈనాడు’కున్న చిన్నచూపు అది. లేకపోతే ఎవరైనా ఇంతటి పనికిమాలిన రాతలు రాస్తారా? వినటానికే సిగ్గుపడాల్సి వచ్చే పసలేని ఆరోపణలు చేస్తారా?‘సన్నిహితులకే కిక్కు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీపై మంగళవారం ‘ఈనాడు’ వెళ్లగక్కిన అక్కసులో అసలు 1 శాతమైనా నిజముందా? ఏది నిజం? చూద్దాం.. 

రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న డిస్టిలరీలు గతంలోనూ... ఇప్పుడు 20 మాత్రమే. పదేపదే చెబుతున్న వాస్తవమేంటంటే... ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఇప్పుడున్నవన్నీ గతంలోనూ ఉన్నాయి. ఈ 20లో 14 డిస్టిలరీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుమతించినవే. సరే! ‘ఈనాడు’ వార్తలోకొస్తే... 16 డిస్టిలరీలకే 74 శాతం ఆర్డర్లు ఇచ్చేశారని గగ్గోలు పెట్టింది. అయితే విలువ పరంగా మాత్రం ఈ ఆర్డర్లు 62 శాతమేనని అదే పత్రిక రాసింది.  

పోనీ.. పరిమాణం ప్రకారమే చూద్దాం. ఉన్నవేమో 20 డిస్టిలరీలు. అందులో 16 డిస్టిలరీలకు 74 శాతం ఆర్డర్లిచ్చారు. అంటే... సగటున ఒక్కో డిస్టిలరీకి దాదాపుగా 5 శాతం ఇచ్చినట్లు. దీన్ని తప్పంటారా? ఇక మిగిలిన 4 డిస్టిలరీలకు 26 శాతం ఆర్డర్లు వచ్చినట్లేగా? సగటున ఇది 6 శాతం కన్నా ఎక్కువే కదా?. మరి వీళ్లకు అన్యాయం జరిగినట్లా? అసలు రామోజీరావు ఏం చెప్పాలనుకున్నారు? ‘ఈనాడు’కు తన పాఠకులంటే ఎందుకింత అలుసు? ఇదెక్కడి పాత్రికేయం? పైపెచ్చు విలువ పరంగా చూస్తే ఈ 16 డిస్టిలరీలకూ ఇచ్చింది 62 శాతమని ఆ కథనంలోనే ఉంది. అంటే... 16 కంపెనీలకు 62% ఆర్డర్లిచ్చి... మిగిలిన 4 కంపెనీలకూ 38% ఇచ్చినట్లు కదా? ఈ 16 కంపెనీలమీద ఎక్కువ ప్రేమ చూపించినట్లా? ఇంతకన్నా దగుల్బాజీ రాతలుంటాయా? ఇదెక్కడి పాత్రికేయం?  

‘ఈనాడు’ రాతలు చూసినా... 
∙2019 అక్టోబరు 2 నుంచి 2021, నవంబరు 30 వరకు రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ వివిధ కంపెనీలకు రూ.17,570.49కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చింది. అందులో 16 కంపెనీలకు రూ. 11,040.65 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. అంటే... ఉన్న 20 డిస్టిలరీల్లో 16 డిస్టిలరీలకు... 62.83% ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఒక్కో డిస్టిలరీకి 4% కంటే తక్కువ. దీన్ని అడ్డగోలుగా ఇవ్వటం అంటారా? 

‘ఈనాడు’ రాయని నిజమిదీ... 
నిజానికిక్కడ చెప్పుకోవాల్సింది ‘ఈనాడు’ రాసిన వార్త గురించి కాదు. అది రాయని నిజాల గురించి. ఎందుకంటే డిస్టిలరీల విషయంలో పచ్చిగా పక్షపాతం చూపించింది చంద్రబాబు ప్రభుత్వమే. బాబు హయాంలో కేవలం 5 డిస్టిలరీలకు ఏకంగా 50 శాతంకన్నా ఎక్కువ మద్యం తయారీ ఆర్డర్లిచ్చారు.

అంటే సగటున ఒకో డిస్టిలరీకీ 10 శాతం. మిగిలిన 15 డిస్టిలరీలకూ కలిపి 50 శాతం. అంటే దాదాపుగా 3%. ఇదీ.. అసలు కథ. ఇక్కడ రామోజీరావు గమనించాల్సింది ఒక్కటే. బాబు హయాంలోనే సన్నిహితులు ఎక్కువ ఆర్డర్లు తాగి మత్తెక్కిపోయారని. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాదాపుగా అన్ని డిస్టిలరీలకూ 5–6% చొప్పున పక్షపాతం లేకుండా ఆర్డర్లు వచ్చాయని. దీన్ని దాచిపెట్టి రామోజీ రాస్తున్న రాతలు చూస్తే... దొంగే... తిరిగి దొంగా దొంగా అని అరిచినట్లు లేదూ..? 


► టీడీపీ హయాంలో 2017–18లో రాష్ట్రంలో మొత్తం 8,106 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు. వాటిలో 5 కంపెనీలకే ఏకంగా రూ.4,122.28 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో పెర్ల్‌ డిస్టిలరీస్‌కు ఒక్కదానికే రూ.1,374.79 కోట్లు, పెర్నోడ్‌ రిచర్డ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీయార్‌ డిస్టిలరీస్‌కు రూ.395.1కోట్లు, అలైడ్‌ బ్లెండర్స్, డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. అంటే అయిదు కంపెనీలకు 50 శాతం కంటే ఎక్కువ ఆర్డర్లిచ్చారు. సగటున వీటికి 10 శాతం కంటే ఎక్కువే.  

► ఇదే చంద్రబాబు హయాంలో 2018–19లో మొత్తం రూ.4,765.75 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లివ్వగా... వీటిలో కేవలం 3 డిస్టిలరీలకు ఏకంగా రూ.2,244.44కోట్ల విలువైన ఆర్డర్లివ్వటం గమనార్హం. పెర్ల్‌ డిస్టిలరీస్‌కు రూ.1,462.41 కోట్లు, సెంటినీ బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52 కోట్లు, ఎస్పీవై ఆగ్రోప్రొడక్ట్సుకు రూ.143.51కోట్లు ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఈ మూడు డిస్టిలరీలకు ఏకంగా 47.09 శాతం. ఒక్కోదానికీ 15 కంటే ఎక్కువే. దీన్ని ఏమంటారు రామోజీ? 

అదాన్‌ డిస్టిలరీస్‌... అసలు ఉందా? 
‘ఈనాడు’ కథనంలో మరో ముఖ్యమైన అంశం... 2019 డిసెంబర్లో ఏర్పాటయిన అదాన్‌ డిస్టిలరీస్‌ అనే సంస్థకు ఈ రెండున్నరేళ్లలో ఏకంగా 1,164 కోట్ల విలువైన మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చేశారన్నది. నిజమేంటంటే... అసలు అదాన్‌ డిస్టిలరీస్‌ అనేదే లేదు. దానికి ప్రభుత్వం ఎలాంటి ఆర్డరూ ఇవ్వలేదు. అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఆయన భాగస్వాములు కలిసి పెట్టుకున్న విశాఖ డిస్టిలరీస్‌లో గతేడాది వరకూ ఉన్న అయ్యన్న కుమారుడు బయటికొచ్చేశాడు. మిగతా భాగస్వాములు... దాన్ని అదాన్‌ కంపెనీకి సబ్‌ లీజుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదీ కథ.

పైపెచ్చు ఈ కంపెనీకి అడ్డగోలుగా ఆర్డర్లు ఇచ్చేశారన్నది కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇప్పటిదాకా రూ.17,570 కోట్ల విలువైన మద్యానికి ఆర్డర్లిస్తే... అందులో విశాఖ డిస్టిలరీస్‌కు ఇచ్చింది ‘ఈనాడు’ రాతల ప్రకారమే రూ.1,164 కోట్లు. అంటే 6 శాతం. మొత్తం డిస్టిలరీలు 20 ఉన్నపుడు.. అందులో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లిస్తే దాన్ని అడ్డగోలుగా ఇవ్వటం అంటారా రామోజీరావు గారూ? వయసు పెరుగుతుంటే లెక్కలు మరిచిపోతారా... ఏమో!!. 

మద్యంలో విషపూరిత అవశేషాలు లేవు
ఓసారి అబద్ధం చెప్పి దొరికిపోతే ఎవరైనా సిగ్గు పడతారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ సిగ్గూఎగ్గూ ఏనాడో వదిలేసింది. అందుకే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విషపూరిత అవశేషాలు ఉన్నాయంటూ ఓ అబద్ధపు నివేదికను మళ్లీ మళ్లీ తెరపైకి తెస్తోంది. అసలు తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ల్యాబరేటరీ స్పష్టం చేస్తున్నా సరే... ఆ ల్యాబ్‌ పేరుతో ఓ తప్పుడు నివేదికను తెచ్చి ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ కుటిల యత్నాలు చేస్తోంది.

చంద్రబాబు డైరెక్షన్‌లో మొదట నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ దుష్ప్రచారాన్ని లేవనెత్తగా బెడిసికొట్టింది. మద్యంలో విషపూరిత అవశేషాలున్నాయంటూ ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖ రాశారు. కానీ మద్యంలో విషపూరిత అవశేషాలున్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ల్యాబరేటరీ బెవరేజస్‌ కార్పొరేషన్‌కు ఈ ఏడాది మార్చిలో లిఖితపూర్వకంగా తెలియజేయటంతో రఘురామకృష్ణం రాజు దుష్ప్రచారం బెడిసికొట్టింది.

అయినా సరే చంద్రబాబు అదే అబద్ధాన్ని ఈ సారి టీడీపీ నేతలతో వినిపించే ప్రయత్నం చేశారు. కానీ మద్యంలో విషపూరిత అవశేషాలు లేవని చెన్నైలోని ఎస్‌జీఎస్‌ ల్యాబరేటరీ... రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌కు లిఖితపూర్వకంగా మరోసారి తెలిపింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని తెలిపింది.

పైరోగలాల్, డై ఇథైల్‌ థాలెట్, ఐసోపులెరిక్‌ యాసిడ్‌ సహజంగా ఏర్పడేవేనని పేర్కొంటూ.. వాటిని తమ ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా నిర్ధారించలేమని కూడా స్పష్టం చేసింది. కేంద్రం ఆమోదించిన ఐఎస్‌ 4449 (విస్కీ), ఐఎస్‌ 4450 (బ్రాందీ) ప్రమాణాల మేరకు తాము మద్యం నమూనాలను పరీక్షించలేదని కూడా వెల్లడించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న టీడీపీ పన్నాగం మరోసారి బెడిసికొట్టగా... ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని పరువునష్టం దావాతో న్యాయపోరాటం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement