అది కొడైకెనాలో.. కుల్లూలోయ కాదు.. మన విశాఖే | Domestic And foreign Tourists To Vanjangi Hills | Sakshi
Sakshi News home page

వంజంగి.. ముద్దాడె నింగి

Nov 11 2021 12:00 PM | Updated on Nov 11 2021 1:00 PM

Domestic And foreign Tourists To Vanjangi Hills - Sakshi

పౌరాణిక సినిమాల్లో నారదుల వారు తంబుర మీటుతూ.. మేఘాల్లోంచి అలా వెళ్లిపోతుంటే.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళిస్తుంటే.. భలే అనిపించేది. అదంతా సినిమా పనితనం. మరి ధవళ వర్ణం మేఘాలు ముద్దాడుతుంటే.. నింగి తలుపులు తెరుచుకుంటూ సూరీడు చొరబడుతుంటే.. పాల కడలి కళ్ల ముందు ఉప్పొంగుతుంటే.. పచ్చని కొండలన్నీ బంగారం తాపడం చేసినట్టు మెరిసిపోతుంటే.. ఏ తనువు మాత్రం మురిసిపోదు? అలాంటి అనుభవాలకు కొడైకెనాలో.. కుల్లూలోయకో వెళ్లిపోనక్కర లేదు. విశాఖ జిల్లా వంజంగి కొండల్ని పలకరిస్తే చాలు.. పాల సంద్రం లాంటి పొగమంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు.  

   
           
పాడేరు: వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఏడాది వ్యవధిలో సుమారు 2లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్‌ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది.  

 పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వ కృషి 
వంజంగి హిల్స్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వంజంగి హిల్స్‌ ప్రకృతి అందాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ సూర్యోదయం, పాల సముద్రం లాంటి మంచు అందాల దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చూపించడంతో ఆయన స్పందిస్తూ పర్యాటక శాఖ ఉన్నతాధికారులను వంజంగి హిల్స్‌కు పంపించారు. పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ రాంప్రసాద్, డీఎం ప్రసాదరెడ్డిల బృందం వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వంజంగి హిల్స్‌కు వస్తున్న పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అంచనాలను రూపొందిస్తోంది.

అందాలు అద్భుతం  
సోషల్‌ మీడియా, అంతర్జాలంలో వంజంగి హిల్స్‌ ప్రకృతి అందాలు హల్‌చల్‌ చేస్తుండటం సంతోషంగా ఉంది. అత్యంత ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వతంపై ఉదయం సూర్యోదయం దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఈ కొండను సందర్శించాను. వంజంగి హిల్స్‌ అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంటోంది.  
– ఆర్‌.గోపాలకృష్ణ,  పీవో, ఐటీడీఏ, పాడేరు 

ఉండిపోవాలనిపిస్తుంది 
వంజంగి హిల్స్‌లోని పాల సముద్రం లాంటి మంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. రాత్రంతా అడవిలో మకాం వేసి తెల్లారకముందే బోలెంగమ్మ శిఖరానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది.  
– కోడూరు హిమబిందు, యూట్యూబర్, విశాఖపట్నం 

వంజంగి హిల్స్‌కు ఎలా వెళ్లాలంటే.. 
విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్‌ జంక్షన్‌ వరకు పక్కా తారురోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్‌గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్‌ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన సమయం గంటన్నర నుంచి రెండు గంటలు. 

► తెల్లవారుజామున 4 గంటల సమయానికే బోనంగమ్మ కొండకు పర్యాటకులు చేరుకోవాలి.  

►రాత్రి బస చేసేందుకు ఎలాంటి కాటేజీలు లేవు. స్థానిక గిరిజనులు టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. పాడేరులో లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి.  

► వంజంగికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. పర్యాటకులు సొంత వాహనాల్లోనే వస్తుంటారు. పాడేరు పట్టణంలోని కార్లు, ఆటోలు మాత్రం ముందుగా బుక్‌ చేసుకుంటే అద్దెకు వస్తాయి.  

► తినడానికి పలు రకాల చికెన్‌ వంటకాలు, అల్పాహారం, నూడుల్స్, నీళ్లు అమ్ముతారు.  

► పాడేరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో అరకులోయ, 30 కిలోమీటర్ల దూరంలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, 60 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక ప్రాంతాలున్నాయి. 

► పాడేరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండం క్షేత్రం, పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం, ఘాట్‌లోని కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు గుడి, అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన డల్లాపల్లి ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement