ఆర్బీకేల్లో పంటల బీమా జాబితాలు

Crop Insurance Lists in RBk - Sakshi

జూలై 3 వరకు అభ్యంతరాల స్వీకరణ

జూలై 8న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా పరిహారం పంపిణీ

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌–2022 సీజన్‌లో పంటల్ని నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన నిర్వహించే రైతు దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారాలను జమ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలను ఆర్బీకేల్లో గురువారం నుంచి ప్రదర్శిస్తున్నారు. జూలై 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అనంతరం తుది జాబితాలను ప్రకటిస్తారు. 

10.20 లక్షల మంది రైతులకు పరిహారం
ఖరీఫ్‌–2022 సీజన్‌లో దిగుబడి ఆధారిత పంటలకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా.. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రైతుల వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను బీమా కంపెనీలకు చెల్లించింది.

ఖరీఫ్‌–2022 సీజన్‌లో పంటలు నష్టపో­యిన వారిలో 10.20 లక్షల మంది అర్హత పొందగా.. వీరికి రూ.1,117.21 కోట్ల పరి­హా­రం చెల్లించాలని లెక్క తేల్చారు. దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రూ.572.59 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి రూ.544.62 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చారు. అర్హుల జాబితా­లను సామాజిక తనిఖీ నిమిత్తం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. పంట విస్తీర్ణం తదితర అంశాలపై ఏదైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆర్బీకేలో జూలై 3వ తేదీ వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top