Atmakur Bypoll: ఆత్మకూరు బరిలో బీజేపీ.. పరువు పోగొట్టుకోవడం ఎందుకంటున్న పార్టీ కేడర్‌ 

Criticisms Over BJP Contesting In Atmakur Bypolls - Sakshi

సాక్షి, నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీ పోటీలో అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించింది. ఇక బీజేపీ మాత్రం పోటీకి అభ్యర్థిని రంగంలోకి దింపింది. స్థానిక కమలం నేతలెవరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో స్థానికేతురుడైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ను బరిలోకి దింపాల్సి వచ్చింది. కానీ ఉప ఎన్నికల్లో పోటీచేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆ పార్టీ కేడర్‌ మథన పడుతోంది. 

ఓట్లు తెచ్చుకోకుంటే.. 
ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ  చేస్తామంటూ ప్రకటన చేసి అభ్యర్థి పేరు ప్రకటించింది. దీంతో పోటీ అనివార్యమైంది. అయితే బీజేపీ ప్రకటనపై ఆ పార్టీలోనే కేడర్‌ అంతర్మథనం చెందుతోంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉన్నతమైన రాజకీయ భావాలున్న వ్యక్తిగా పేరు గడించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ పదవికే వన్నెతెచ్చారు. ఏ రాజకీయ పార్టీని కూడా విమర్శలు చేసేవారు కాదు. హుందా రాజకీయాలకు విలువనిచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గౌతమ్‌రెడ్డి మరణాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోయాయి.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం ఆయన చివరిచూపు కోసం తపించారు. అంతటి పేరు ప్రఖ్యాతలున్న నేత స్థానంలో ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీచేయబోమని ప్రకటన చేయగా, బీజేపీ మాత్రం బరిలో ఉంటామని ప్రకటన చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పోటీ చేసి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తెచ్చుకోకుంటే పార్టీ పరువు పోతుందని బాహాటంగానే చెబుతున్నారు.

పార్టీలోనే విమర్శలు
1989లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా కర్నాటి ఆంజనేయరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 2004 ఎన్నికల్లో కూడా టీడీపీ పోత్తులో భాగంగా బొల్లినేని కృష్ణయ్య బీజేపీ నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు విజయం సాధించారు. ఆపై ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా కనీస దరావతు కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనకు జనం జై కొడుతున్నారు. దీనికితోడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సానుభూతి ప్రభంజనంలా పనిచేస్తుంది. ఈ తరుణంలో బీజీపీ పోటీకి సిద్ధపడడంపై ఆ పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top