వరి వంగడాల పంట

Creation of new Paddy Varieties at Nellore Rice Research Centre - Sakshi

నెల్లూరు వరి పరిశోధన కేంద్రంలో నూతన వంగడాల సృష్టి  

ఇప్పటికే 29 రకాలను సృష్టించిన శాస్త్రవేత్తలు 

తాజాగా ఎన్‌ఎల్‌ఆర్‌ 3238 వంగడం మార్కెట్లోకి..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు వరి పరిశోధన కేంద్రంలో 1948 నుంచి వివిధ రకాల వరి వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దాదాపుగా 29 కొత్త వంగడాలను రైతులకు అందించారు. ఇక్కడ పరిశోధన చేసిన వివిధ వంగడాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యంలో ఉంటున్నాయి. 1948లో బీసీపీ–1, బీసీపీ–2 అనే రెండు రకాల వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. 1950లో బీసీపీ–3, 4, 1951లో 5ని, 1965లో 6తో పాటు బల్క్‌హెచ్‌ 9ని సృష్టించారు. అనంతరం మొలగొలుకులు –72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తెచ్చారు. తర్వాత కొత్త మొలగొలుకులు–74 పేరుతో మరో రకాన్నీ తెచ్చారు. 

అనంతరం పినాకిని, తిక్కన, సింహపురి, శ్రీరంగ, స్వర్ణముఖి, భరణి, శ్రావణి, స్వాతి, పెన్నా, సోమశిల, వేదగిరి, అపూర్వ, మసూరి, స్వేత, ధన్యరాశి, సిరి, సుగంథ రకాలనూ తయారు చేశారు. ఒక్కో వంగడం తయారీకి దాదాపు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతోంది. కొన్ని వంగడాలైతే ఐదేళ్ల సమయం కూడా తీసుకుంటున్నాయి. తాజాగా ఎన్‌ఎల్‌ఆర్‌–3238ను వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇది తెగుళ్లను తట్టుకునే శక్తి కలది. ఇందులో జింక్‌ పుష్కలంగా ఉండటంతో రబీలో పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.   

బీపీటీ 5204తో సమానంగా దిగుబడి 
ఎంటీయూ 1010, బీపీటీ 5204 సంకరంతో ఎన్‌ఎల్‌ఆర్‌ 3238ను సృష్టించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల సృష్టిలో భాగంగా ఈ రకాన్ని వృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ వంగడం బయటకొచ్చింది. బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్వల్ప కాలంలో అధిక దిగుబడులిచ్చేలా..   
రైతులకు అవసరమయ్యేలా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు అనేక విధాలుగా పరిశీలన చేస్తుంటాం. తాజాగా ఎన్‌ఎల్‌ఆర్‌ 3238ను రూపొందించాం. ఇది స్వల్ప కాలంలో అధిక దిగుబడులిచ్చి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
– వినీత, ప్రధాన శాస్త్రవేత్త 
 
ఇతర ప్రాంతాల్లోనూ వినియోగం  
తాము పరిశోధన చేసి సృష్టించిన వరి వంగడాలలో చాలా వరకు మంచి ఫలితాలిస్తున్నాయి. జిల్లా నుంచి తయారు చేసిన సీడ్స్‌ను ఇతర ప్రాంతాల్లోనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని వంగడాలను రైతులకు అందించేలా  అన్ని విధాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. 
– సీహెచ్‌ శ్రీలక్ష్మి, సీనియర్‌ శాస్త్రవేత్త 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top