
అక్టోబర్ 31 వరకు స్మార్ట్ కార్డుల్లో తప్పుల సవరణ
మంత్రి నాదెండ్ల మనోహర్
సాక్షి, అమరావతి: వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే రైస్ కార్డును రద్దు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ తీసుకోకపోవడంపై సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే రద్దైన కార్డును యాక్టివేట్ చేస్తారన్నారు. కొత్తగా పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో లబ్దిదారుల వివరాల్లో తప్పులను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సవరించేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించామని చెప్పారు.
ఈ–కేవైసీ, ఆధార్ ఆధారంగా కార్డులు ముద్రించామన్నారు. నవంబర్ 1 నుంచి నామినల్ రుసుము రూ.35 చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపిస్తామని తెలిపారు. వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ ద్వారా కూడా కార్డులో వివరాల మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో 14.5 కేజీల సిలిండర్లను అందిస్తున్నట్టు పేర్కొన్నారు.