
సాక్షి, అమరావతి: వంట గ్యాస్ సిలిండర్ మరోసారి భగ్గుమంది. సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 చొప్పున ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్పత్తి సంస్థలు ధర పెంచిన నేపథ్యంలో విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.857 నుంచి రూ.882కి పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రవాణా వ్యయం ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.882కి కాస్త అటూఇటుగా ఉంది. 2019 ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ రూ.732 ఉండగా ఇప్పుడు రూ.882లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.150 మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది.
గత నెలలోనూ..
వంట గ్యాస్ సిలిండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. గత నెల 1న గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.5 పెంచిన ఉత్పత్తి సంస్థలు తాజాగా మరో రూ.25 పెంచేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది.