ఇది దేవుడిచ్చిన వరం | CM YS Jagan Inaugurates Jagananna YSR Badugu Vikasam | Sakshi
Sakshi News home page

ఇది దేవుడిచ్చిన వరం

Oct 27 2020 2:09 AM | Updated on Oct 27 2020 6:46 AM

CM YS Jagan Inaugurates Jagananna YSR Badugu Vikasam - Sakshi

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకుగాను రూపొందించిన ప్రత్యేక పారిశ్రామిక విధానం– 2020–23 బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. స్టాంప్‌ డ్యూటీ రద్దు.. విద్యుత్‌ చార్జీల్లో, రుణాలపై వడ్డీలో, భూ కేటాయింపుల్లో, స్టేట్‌ జీఎస్టీలో రాయితీ ఇస్తున్నాం. క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్‌ రిజిస్ట్రేషన్‌ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకొచ్చాం. వీటన్నింటి వల్ల ఎస్సీ, ఎస్టీలు ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు.
–సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ‘జగనన్న–వైఎస్సార్‌ బడుగు వికాసం’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఏం చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్‌) ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకు వస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ సెల్స్‌ (సదుపాయాల కల్పన) కూడా ఏర్పాటు చేశామని, వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని, ఇది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇస్తుందన్నారు. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి కొత్త పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 
నవరత్నాలతో ఆదుకుంటున్నాం

– పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ మంచి జరగాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలని, వారి జీవితాలు సంపూర్ణంగా మార్చాలన్న ఉద్దేశంతో అడుగులు వేశాం. 
– పేదలకు అమ్మ ఒడి పథకం తీసుకున్నా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదలకు పెద్దపీట వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం.
– గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో దాదాపు 82 శాతం ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దక్కాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకుండా చూస్తున్నాం. 

వారి కాళ్ల మీద వారు నిలబడాలని..
– నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హులైతే చాలు, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం.
– చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా పేదలు పారిశ్రామికంగా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే దిశలో ఊతమిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్, పీ అండ్‌జీ, రిలయన్స్, హిందుస్తాన్‌ లీవర్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకు వచ్చాం.  
– నేటి విద్యార్థులు భావితరంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశ పెడుతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని పలు కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
– ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కె రోజా, ఎంపీలు నందిగం సురేష్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగు నాగార్జున, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, జొన్నలగడ్డ పద్మావతి, అలజంగి జోగారావు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్, ఆ శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రమణ్యం, పలువురు సీనియర్‌ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020–23 లో కీలక అంశాలు 
– 2020లో రీస్టార్ట్‌ ఒన్‌ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్‌ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఏటా సగటున ఎస్సీలకు రూ.53 కోట్లు, ఎస్టీలకు రూ.15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 
– ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు. 25 శాతం చెల్లిస్తే భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లించవచ్చు. 
– 100 శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని రీయింబర్స్‌ చేస్తారు. భూముల లీజు, షెడ్డు, భవనాలు, తనఖా తదితరాలపై 100 శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్‌ చేస్తారు.
– ఇండస్ట్రియల్‌ ఎస్టేట్, ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎంఎస్‌ఈల కోసం భూములను 50 శాతం రిబేటుపై (రూ.20 లక్షల వరకు) ఇస్తారు. 
– ల్యాండ్‌ కన్వెర్షన్‌ చార్జీల్లో 25 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎంఎస్‌ఈలకు రిబేటు ఇస్తారు. 
– ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి తదుపరి 5 ఏళ్ల వరకు వాడుకున్న కరెంట్‌లో యూనిట్‌కు రూ.1.50 రీయింబర్స్‌ చేస్తారు. 
– ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకు, గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ లభిస్తుంది. 
– సర్వీసులు, రవాణా రంగాల్లో క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ లభిస్తుంది. 
– ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఈలకు ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. నెట్‌ ఎస్‌జీఎస్‌టీలో 100 శాతం రీయింబర్స్‌ లభిస్తుంది. మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రీయింబర్స్‌మెంట్‌ అందుతుంది. 
– క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌లకు అయ్యే ఖర్చులో ఎంఎస్‌ఈలకు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి సీడ్‌ కేపిటల్‌ అసిస్టెన్స్‌ కింద మెషినరీ ఖర్చులో 25 శాతం అందుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement