AP: ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan comments with employees union leaders - Sakshi

మీరు లేకపోతే నేను లేనని గుర్తు పెట్టుకోండి 

ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు 

పరిస్థితి బావుండి ఉంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని 

కానీ ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం 

ఇప్పుడు మొత్తంగా రూ.11,577 కోట్ల అదనపు భారం పడుతోంది 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రతిపాదనలు అంగీకరించినందుకు ధన్యవాదాలు 

మీ సహకారం వల్లే పారదర్శకంగా, అవినీతి లేకుండా ప్రజలకు మేలు చేస్తున్నాను  

భావోద్వేగాలకు తావు ఇవ్వకండి.. ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం 

అన్ని వివరాలతో సీపీఎస్‌ మీద దృష్టి పెట్టాం.. వాటన్నింటినీ మీతో చర్చిస్తాం 

మరో చోట మేలు జరుగుతుందని రిటైర్‌మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం 

ఇలాగే ఇళ్ల స్థలాల విషయంలో మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం

ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం వైఎస్‌ జగన్‌  

ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఒకచోట కాకపోతే మరో చోట మేలు చేయాలన్న ఆలోచనతో పలు నిర్ణయాలు తీసుకున్నామనే విషయాన్ని గమనించండి. మీరు రిటైర్‌ అయ్యాక కూడా బాగా జీవించేందుకు ఏం చేస్తే బావుంటుందో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ మీతో చర్చించాకే అడుగులు ముందుకు వేస్తాం.   
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మీది.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. మీరు లేకపోతే నేను లేను’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్‌సీకి సంబంధించి తాము లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళనను విరమించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు... ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరినీ సంతోషంగా చూడటం చాలా ఆనందం కలిగించిందన్నారు. ‘‘మీ అందరికీ వినయపూర్వకంగా మరోసారి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం మీది. ఆ విషయం మనసులో ఉంచుకోండి.

ప్రజలకు మంచి చేయడానికి ఈ రోజు నేను నాలుగడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడున్న ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఆశించిన రీతిలో ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ మనసా.. వాచా.. కర్మణా.. ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం. మొత్తంగా మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా తాను సన్నద్ధంగా ఉన్నానన్నది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు 

రాజకీయాలకు తావు ఉండకూడదు 
ఉద్యోగుల్లోకి, ఉద్యమాల్లోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. ఏ సమస్య ఉన్నా రండి. అనామలీస్‌ కమిటీ కూడా ఉంది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో ఏర్పాటయిన హైపవర్‌ కమిటీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా, వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది. ఉద్యోగులూ ఇందులో భాగమే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గం ఉంది. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ అందరికీ ఇదే నా అభ్యర్థన. 

మొత్తంగా రూ.11,577 కోట్లు భారం 
► నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్‌లో ఉంది. నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పింది. ఆ నిర్ణయాలు మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 
► ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి గాను, 9 నెలల కాలాన్ని సర్దుబాటు నుంచి మినహాయించాం. అలా చేయటం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు అదనంగా భారం పడుతోంది. హెచ్‌ఆర్‌ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5,725 కోట్లు అదనపు భారం. 
► ఇది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్‌ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్‌ఆర్‌ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ వల్ల మరో రూ.450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1,330 కోట్లు భారం పడుతోంది.  
► ఇంతకు ముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ఏటా పెరుగుతుందనుకుంటే.. దానికి ఈ రూ.1,330 కోట్లు రికరింగ్‌. అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు భారం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా భారం పడుతుంది. పరిస్థితులు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు చెబుతున్నాను.  

ఆర్థిక పరిస్థితి బాగుంటే మరింత సంతోష పెట్టేవాడిని 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.5,725 కోట్లు మీ పోస్ట్‌ రిటైర్మెంట్‌కు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే చాలా కష్టం. మనమంతా ఒక్కటిగా కలిసి ముందుకెళదాం. పరిస్థితులు ఇలా ఉండకపోయి ఉంటే.. మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మీరంతా నా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చే పరిస్థితులుండేవి. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు లేవు. 

సీపీఎస్‌పై గట్టిగా పని చేస్తున్నాం
భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. సీపీఎస్‌ మీద అన్ని వివరాలు తీసుకుని గట్టిగా పని చేస్తున్నాం. ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్‌ బాగా పెరిగేలా చూస్తాను. ఒక ఉద్యోగస్తుడు రిటైర్‌ అయ్యాక.. గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ గొప్ప మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. అదే జగన్‌ ప్రభుత్వం మీకు చేయబోయే గొప్ప మేలు. అంత దూరం ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న పరిస్థితికి భిన్నంగా మీకు ఏ విధంగా మంచి చేయాలనే దానిపై చాలా అధ్యయనం చేస్తున్నాం.

ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది.  రిటైర్‌ అయ్యాక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఒక మంచి పరిష్కారంతో వస్తాం. ఇందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను. ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది చర్చిస్తాం. అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్‌ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల సానుకూలంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 

30 వేల మంది టీచర్లకు పదోన్నతులు  
30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్‌ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్‌ చెప్పే ఇవాళ్టి పరిస్థితి  మారాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్స్‌ ఉండేలా చూస్తున్నాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. దీనివల్ల ఒక టీచర్‌ ఒక సబ్జెక్ట్‌ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు. ప్రిపేర్‌ అయి బాగా చెప్పగలుగుతాడు. ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేశాం. బైలింగువల్‌ టెక్స్‌›్ట బుక్స్‌.. అంటే ఒకపేజీ తెలుగు, పక్క పేజీలో అదే ఇంగ్లిష్‌లో ఉండటం వల్ల పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. టీచర్ల కెపాసిటీ పెరుగుతుంది.  

పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పొడిగింపు 
► ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. అందరు కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం. ఎక్కడైనా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దానివల్ల 24 నెలల జీతం రూపేణా మరో చోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ఎంఐజీ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం.  
► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.   

ఆదాయం పెరగకపోగా పడిపోయింది 
రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. 2018–19లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు. మామూలు పరిస్థితుల్లో అయితే 2019–20లో అది 15 శాతం పెరిగి రూ.72 వేల కోట్లు అయ్యుండాలి. కానీ ఒక్కశాతం  కూడా పెరగకపోగా తగ్గి రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2020–21లో మళ్లీ 15%పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84 వేల కోట్లు కావాలి. అలాంటి పరిస్థితులు ఉండి... అప్పుడు మన చర్చలు సాగుతుంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ 2020–21లో కూడా ముందటి సంవత్సరంకన్నా ఒక్క రూపాయి కూడా పెరగకుండా రాష్ట్రాదాయం రూ.60 వేల కోట్లలోపే ఉండిపోయింది. మరోవైపు జీతాల బిల్లు మాత్రం ఏటేటా పెరుగుతూ వస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేలు వర్తింపచేశాం.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్‌ వర్కర్ల జీతాలు అన్ని రకాలుగా పెంచాం. వీటన్నింటి వల్ల 2018–19లో ఉన్న రూ.52 వేల కోట్ల శాలరీ బిల్లు ఈ ఏడాది రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజా నిర్ణయాలతో ఇప్పుడు మళ్లీ సుమారు రూ.11 వేల కోట్లు అదనంగా పడుతోంది. అంటే రూ.78వేల కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మన చర్చలు జరిగాయన్నది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను అని. అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే అది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్థలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top