ఉగ్రపోరులో దేశం కోసం ప్రాణాలర్పించిన కమాండో

Chittoor District Commando Deceased In Jammu Kashmir Terror Attack - Sakshi

ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్‌ జవాను మృతి

సంక్రాంతికి వస్తానని చెప్పి అనంత లోకాలకు..

కన్నీరుమున్నీరవుతున్న గ్రామం

ఆయన మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు.

సాక్షి, చిత్తూరు : ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్‌ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్‌–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌ లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్‌ సైనికులు మృతిచెందారు.  సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్‌ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.

గ్రామంలో విషాదఛాయలు
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. అలాంటి వ్యక్తి కాల్పుల్లో మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలతో విచలితులయ్యారు. 

దేశసేవ చేయాలని యువతకు చెప్పేవారు
సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతిచెందడం గ్రామానికి తీరని లోటు.    – రవి, గ్రామస్తుడు

చాలా చురుకైన వ్యక్తి 
ప్రవీణ్‌ కుమార్‌ సైన్యంలో చురుకైన వ్యక్తి. జమ్మూకాశ్మీర్‌లో కుష్వారా సెక్టార్‌లో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నేను సీహెచ్‌ఎంగా ఉన్నాను. అలర్ట్‌గా ఉండేవారు. నేను సెలవుల్లో వచ్చాను. నా స్నేహితుడు వీరమరణం పొందాడని తెలియగానే షాక్‌ గురయ్యా.      –హేమాద్రి, వెదుర్లవారిపల్లె

చాలా మంచివాడు
ప్రవీణ్‌ చాలా మంచివాడు, సైన్యం నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చినా గ్రామం గురించి ఆలోచించేవాడు. అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడనే విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాం.    –బాబురెడ్డి, మృతుడి బాబాయి, రెడ్డివారిపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top