Changes In The Subsidies Of Electric Vehicles After End Of This Month - Sakshi
Sakshi News home page

 ఈ–బైక్‌ కొనాలంటే.. త్వరపడండి!

May 26 2023 4:28 AM | Updated on May 26 2023 9:58 AM

Changes in the subsidies of electric vehicles after end of this month - Sakshi

సాక్షి, అమరావతి: ఈ–బైక్‌ కొనాలనుకుంటున్నారా. అయితే, త్వరపడండి. ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ తర్వాత రిజిస్టర్‌ అయ్యే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్‌–2 (దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రోత్సాహం) పథకం కింద అందించే సబ్సిడీని తగ్గించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ బైక్స్‌పై 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా.. కేంద్ర నిర్ణయంతో ఇకపై వాహన ధరలో కేవలం 15 శాతం లేదా కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)కు రూ.10 వేలు ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీగా లభించనుంది. 

భారీ షాక్‌ ఇది
విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎస్‌ఏఎంఈ) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్‌ పథకంలో రూ.10 వేల కోట్లను కేటాయించింది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి.

ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీనిద్వారా ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. దీంతో ఏపీలో దాదాపు 22 వేలు, దేశవ్యాప్తంగా 4 లక్షల విద్యుత్‌ వాహనాల విక్రయం జరిగింది. కానీ సబ్సిడీని కుదిస్తున్నట్టు ప్రకటించి తాజాగా కేంద్రం పెద్ద షాక్‌ ఇచ్చింది.

పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే 4.9 శాతమే
నిజానికి అంతర్జాతీయంగా ఈవీల శాతం పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే 20 శాతంగా ఉంది. మన దేశంలో ఇది కేవలం కేవలం 4.9 శాతం మాత్రమే. కనీసం అంతర్జాతీయ బెంచ్‌ మార్క్‌ను చేరుకునే వరకైనా రాయితీలను కొనసాగిస్తే మంచిదనే వాదనలు మార్కెట్‌ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి చెప్పుకొచ్చింది.

రానున్న నాలుగేళ్లలో 1 మిలియన్‌ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. కానీ ఒక లీటర్‌ పెట్రోల్‌ 2.3 కిలోల కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఈవీల కొనుగోలు తగ్గితే 2030 నాటికి 1 మిలియన్‌ కర్బన ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement