ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం | Chandrababu Negligence On Stree Shakti Scheme In Andhra Pradesh Amid Push For Private E-Buses, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం

May 19 2026 5:56 AM | Updated on May 19 2026 12:36 PM

Chandrababu Negligence on Stree Shakti scheme: Andhra pradesh

స్త్రీశక్తి పథకానికి బాబు సర్కారు దొంగదెబ్బ

వందశాతం ఈ–బస్సుల ముసుగులో పన్నాగం 

ఇప్పటికే తూతూమంత్రంగా పథకం అమలు 

మొత్తం 16 కేటగిరీల్లో 5 రకాల బస్సుల్లోనే పథకం వర్తింపు.. ఇప్పటికే ఈ–బస్సుల్లో వర్తించని ఉచిత పథకం 

ఇక ముందు వచ్చేవన్నీ ఈ–బస్సులేనని ప్రకటించిన ప్రభుత్వం.. కుట్రపూరితంగా డీజిల్‌ బస్సులు తొలగిస్తున్న వైనం

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంలో చంద్రబాబు మరోసారి తన మార్కు చూపిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని దొంగ దెబ్బ తీస్తున్నారు. ఈ–బస్సుల ముసుగులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు ఎత్తుగడ వేశారు. ఓ వైపు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ విలువైన ఆస్తులను తమ అస్మదీయులకు కట్టబెడుతున్న బాబు మరోవైపు స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర మహిళలను మోసం చేసేందుకు పావులు చకచకా కదుపుతున్నారు.  

ఈ–బస్సులకు వర్తించని ఉచిత బస్సు 
చంద్రబాబు ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఆయన  2024 జూన్‌ 12న అధికారంలోకి వచ్చినా 15 నెలల వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనే లేదు. తద్వారా రాష్ట్ర మహిళలు నెలకు రూ.250 కోట్ల చొప్పున 15 నెలల్లో ఏకంగా రూ.3,750 కోట్ల మేర ప్రయోజనాన్ని కోల్పోయారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని తూతూమంత్రంగా ప్రారంభించారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదు.

ఆర్టీసీలో 16 కేటగిరీల బస్‌ సర్వీసులు ఉండగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ వంటి ఐదు రకాల సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారు. ఈ–బస్సులతోపాటు వెన్నెల, డాల్పిన్‌ క్రూయిజర్, అమరావతి, నైట్‌ రైడర్, ఇంద్ర, మెట్రోలగ్జరీ, స్టార్‌ లైనర్, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్, ఎస్‌ఏపీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో వర్తింపజేయడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహిస్తున్న 100 ఈ–బస్‌ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాకపోవడం గమనార్హం.  

వందశాతం ఈ–బస్సులతో ఉచితం హుళక్కే 
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. వందశాతం ఈ–బస్సులను ప్రవేశపెట్టే విధానానికి ఆమోదం తెలిపింది. అది కూడా పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ప్రైవేటుపరం చేసేందుకు పక్కా కుతంత్రంతో ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్‌ సేవా’ పథకం ద్వారా ప్రవే­శపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కొత్త డీజిల్‌ బస్సులను కొనడం లేదు.

ఉచిత బస్సు ప్రయాణానికి.. చంద్రబాబు మంగళం!

ఇటీవల ఆరు నెలల్లోనే 264 డీజిల్‌ బస్సులను సర్వీసుల నుంచి పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్‌ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని సర్కారు స్పష్టం చేస్తోంది. మొదటగా ఆర్టీసీలో 50శాతం ఈ–బస్సులు ఉండేట్టు చూడటం ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం 2029 నాటికి 100శాతం ఈ–బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ–బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలు కావడం లేదు కాబట్టి.. కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సుల్లోనూ అదే నిబంధన వర్తించనుందనేది సుస్పష్టం. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులూ ధ్రువీకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement