
గత ఏడాది రూ.10,716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 53.58 లక్షల మందికి లబ్ధి
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇస్తున్నది 46.86 లక్షల మందికే
7 లక్షల మంది రైతులకు ఎగనామం
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదానికి అదనంగా తామే రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు
14 నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేత
రెండో ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త పన్నాగం
పీఎం కిసాన్‌తో కలిపి రైతుల ఖాతాల్లో తొలి విడత నేడు జమ చేయనున్న సీఎం
14 నెలలుగా బకాయి పడిన సొమ్మును వడ్డీతో సహా ఇవ్వాలని రైతుల డిమాండ్
అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా అని మండిపాటు
సాక్షి, అమరావతి: హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడం.. ఒకటీ అరా అరకొరగా అమలు చేసి అంతా చేసేశామని చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమని రాష్ట్రంలో విస్తృత చర్చ నడుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇటీవల తల్లికి వందనం పథకమైనా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకమైనా కోతల మయమేనని స్పష్టమవుతోంది.
అధికారంలోకి రాగానే పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ఏటా ప్రతీ రైతుకు తామే రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ము రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే సాయం అంటూ నాలుక మడతేశారు.
తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది. అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.5 వేలు పీఎం కిసాన్ 20వ విడత సాయం రూ.2 వేలతో కలిపి శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల హామీకి తూట్లు
ఎన్నికల హామీ మేరకు పీఎం కిసాన్‌తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఏటా రూ.26 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ లెక్కన 2023–24లో అర్హత పొందిన 53.58 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,716 కోట్లు అవసరం. కానీ 2024–25లో ఇదిగో.. అదిగో అంటూ తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.
గతేడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేస్తుందని రైతులు భావించారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుందని భావించారు. కనీసం ఈ ఏడాది రూ.20 వేలు చొప్పున ఇవ్వాలన్నా రూ.10,716 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. కానీ 2025–26 బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. దీంతో వడపోత అనంతరం 46.86 లక్షల మందిని అర్హులుగా తేల్చింది.
అంటే వైఎస్సార్‌సీపీ హయాంతో పోల్చుకుంటే 6.72 లక్షల మందికి కోత పెట్టారు. కాగా, అర్హత పొందిన వారికి పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.831.51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లు కలిపి రూ.3,174.43 కోట్లు తొలి విడత సాయం జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పైగా ఎన్నికల హామీకి విరుద్ధంగా మూడు విడతల్లో జమ చేస్తామని చెప్పింది.
తొలి విడత సాయం ఏప్రిల్‌లో, మే లో అంటూ తుదకు ఆగస్టులో అరకొరగా అదీ పీఎం కిసాన్‌తో ముడిపెట్టి నేడు జమ చేసేందుకు సన్నద్ధమైంది. కాగా, స్థానిక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల్లో కేవలం పీఎం కిసాన్ సొమ్ము మాత్రమే జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ సొమ్మును ఎన్నికల కోడ్ ముగిశాక ఇస్తారు.
కౌలు రైతులకు ఇస్తారో.. ఇవ్వరో..
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ కౌలుదారులకు 2019–23 మధ్య ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేది. ఏటా సగటున 1.64 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగు దారులైన కౌలు రైతులందరికీ భూ యజమానులతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పెద్దలు ఎన్నికల్లో గొప్పగా ప్రకటించారు.
ఆచరణకు వచ్చేసరికి సీసీఆర్సీ కార్డులతో పాటు ఈ పంట నమోదు తప్పనిసరి అని మెలిక పెట్టారు. ఏటా ఏప్రిల్–మే నెలల్లోనే ప్రత్యేక మేళాల ద్వారా సీసీఆర్సీ కార్డులు జారీ చేసేవారు. కానీ ఈ ఏడాది జూన్ మూడో వారంలో కానీ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది 10 లక్షల కార్డుల జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3 లక్షల మందికి మించి కార్డులివ్వలేదు. సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు సాయం అందిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఐదేళ్లూ క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం
తాము అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే అన్నదాతలను మరింత ఉదారంగా ఆదుకోవాలన్న సంకల్పంతో హామీ కంటే మిన్నగా రూ,12,500కు బదులు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని ప్రకటించారు.
ఆ మేరకు తొలి ఏడాది నుంచి రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు సాయం చేశారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సొంతంగా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులందరికీ పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచారు.
ఏటా 1.64 లక్షల మంది కౌలుదారులతో పాటు 94 వేల మంది అటవీ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం అందించి తన పెద్దమనసును చాటుకున్నారు. నాడు వెబ్‌ల్యాండ్ పరిధిలో లేని వారితో పాటు వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేని వారు, ఈ కేవైసీ రిజక్ట్ అయిన వారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ వారు, తప్పుడు ఆధార్ సీడింగ్ అయిన వారు, కుటుంబంలో పన్ను చెల్లింపుదారులున్న సాగుదారులు, చనిపోయిన వారి కుటుంబాలలో నామినీలకు.. ఇలా అర్హత ఉన్న ప్రతి రైతుకూ వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి చేకూర్చారు.