‘అప్పు’డే తెల్లారింది! | Chandrababu Naidu government releases new debt calendar | Sakshi
Sakshi News home page

‘అప్పు’డే తెల్లారింది!

Apr 4 2026 4:53 AM | Updated on Apr 4 2026 4:53 AM

Chandrababu Naidu government releases new debt calendar

చంద్రబాబు సర్కారు కొత్త అప్పుల క్యాలెండర్‌ విడుదల 

నూతన ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.27,000 కోట్లు బడ్జెట్‌ అప్పు 

నెలనెలా రూ.9,000 కోట్ల చొప్పున రుణాల సేకరణ 

వచ్చే మంగళవారం రూ.4,400 కోట్ల అప్పు.. రిజర్వ్‌ బ్యాంక్‌కు ఇండెంట్‌ పెట్టిన చంద్రబాబు సర్కారు 

నోటిఫై చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లెండర్‌ విడుదల

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీల అమలు క్యాలెండర్‌ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) చేయ­నున్న బడ్జెట్‌ అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. 

తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్‌ అప్పుల క్యాలెండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. 

సూపర్‌ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? 
ఆర్‌బీఐ చేత అప్పుల క్యాలెండర్‌ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్‌ సిక్స్‌తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్‌ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. 

కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్‌బీఐ నోటిఫై చేసింది. 

2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్‌ ఇలా 
తేదీ            అప్పు మొత్తం (రూ.కోట్లలో) 
ఏప్రిల్‌ 7           4,400 
ఏప్రిల్‌ 21        4,600 
మే 5              4,400 
మే 19           4,600 
జూన్‌ 2           4,400 
జూన్‌ 16         4,600 
మూడు నెలల్లో అప్పు        రూ.27,000 కోట్లు 

బడ్జెట్‌ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు 
యూనియన్‌ బ్యాంక్‌ నుంచి టర్మ్‌ రుణం 
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్‌ విజయానంద్‌ 
దీంతో ఏపీపీఎఫ్‌సీఎల్‌ అప్పు రూ.13,610 కోట్లు  
సాక్షి, అమరావతి: బడ్జెట్‌ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్‌సీఎల్‌) రూ.2,000 కోట్ల టర్మ్‌ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్‌సీఎల్‌ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్‌సీఎల్‌ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement