వెలగపూడి ప్యాలెస్‌లో ‘భూ’మాయాజాలం! | Chandrababu Family new palace being built in Velagapudi with Land scam | Sakshi
Sakshi News home page

వెలగపూడి ప్యాలెస్‌లో ‘భూ’మాయాజాలం!

May 4 2026 5:02 AM | Updated on May 4 2026 5:02 AM

Chandrababu Family new palace being built in Velagapudi with Land scam

అమరావతిలో చంద్రబాబు నిర్మించుకుంటున్న నూతన ప్యాలెస్‌

రాజధాని ప్రధాన ప్రాంతంలో సీఎం కోడలు నారా బ్రాహ్మణి 25 వేల చదరపు గజాలు కొనుగోలు 

ఆ ప్లాటులో రూ.వందల కోట్లతో అత్యాధునిక ప్యాలెస్‌ని నిర్మిస్తున్న చంద్రబాబు కుటుంబం

ఆ ప్లాటు దక్షిణం వైపు 3,670 గజాల రెసిడెన్షియల్‌ స్థలం ఖాళీగా ఉన్నట్లు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లో స్పష్టీకరణ 

నారా బ్రాహ్మణి ఆ ప్లాటును కొనుగోలు చేశాక ఆ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేసిన సీఆర్‌డీఏ 

రెసిడెన్షియల్‌ స్థలం ఖాళీ ప్రాంతంగా ఉండుంటే అక్కడ మరికొందరు రైతులకు ప్లాట్లు ఇచ్చే అవకాశం

ఆ ప్రాంతంలో మరెవరికీ ప్లాట్లు ఇవ్వకూడదనే ఈ ఎత్తుగడ 

తద్వారా గజానికి రూ.50 వేల చొప్పున సీఆర్‌డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం  

2015 జనవరి 3న జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్‌లో 163–బీలో ఎకరం భూమిని శ్మశానంగా చూపిన సీఆర్‌డీఏ  

ఆ భూమి తనదిగా పేర్కొన్న కంచర్ల శాంతి కిరణ్‌.. బదులుగా వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ స్థలం కేటాయింపు  

ఆ వెయ్యి గజాలతోపాటు కంచర్ల శాంతి కిరణ్‌ కుటుంబం నుంచి నారా బ్రాహ్మణి 25 వేల గజాలు రూ.18.75 కోట్లతో కొనుగోలు.. అంటే గజం రూ.7,500 చొప్పున కొనుగోలు.. ఈ లెక్కన ఎకరం ధర రూ.3.63 కోట్లే 

ప్రధాన రాజధాని ప్రాంతంలో వాస్తవ ధర అంతేనా? ఈ లెక్కన ఎన్ని ఎకరాలు అమ్మితే రాజధానికి తెచ్చిన అప్పు తీరుతుందంటున్న మేధావులు 

ఇలాగైతే అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌ ఎలా అవుతుందని నిలదీస్తున్న ప్రజా సంఘాలు 

ఒకవేళ చంద్రబాబు కోడలు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లే

సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్‌ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్‌ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్‌ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్‌డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్‌ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సీఆర్‌డీఏ కేటాయించడం.. అందులో మార్పులు చేయడం చేసేస్తోంది. దీనికి తార్కాణం రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్‌ కేపిటల్‌ ఏరియా)లో శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో, వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో రూ.వందల కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు కుటుంబం 25 వేల గజాల్లో (5.17 ఎకరాలు) నిర్మిస్తున్న ప్యాలెస్సే అందుకు తార్కాణం. 

రాజధానిలోని వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావుకు చెందిన సర్వే నంబరు 142–బీ, 142–సీ, 89లోని 4.41 ఎకరాలు, కంచెర్ల శాంతికిరణ్‌కు చెందిన సర్వే నంబరు 136–సీ, 160, 163–బీ, 184–బీలోని 11.10 ఎకరాలు, కంచెర్ల ఓంకార్‌కు చెందిన సర్వే నంబరు 136–సీ, 85, 89లోని 14.01 ఎకరాలు.. మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్‌డీఏకు ఇచ్చారు. ఇందుకుగానూ రాజధాని ప్రధాన ప్రాంతం వెలగపూడిలో సర్వే నంబరు 111, 112, 113, 122, 150, 152, 239లోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్‌డీఏ రిటర్నబుల్‌ ప్లాట్ల కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్‌ 2న కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున పాసివ్‌ జోన్‌ (హరిత ప్రాంతం), దక్షిణం వైపున రెసిడెన్షియల్‌ ఖాళీ స్థలం, తూర్పు వైపున 17 మీటర్ల రోడ్డు, పశ్చిమ వైపున 25 మీటర్ల రోడ్డును హద్దులుగా పేర్కొన్నారు. 

రెసిడెన్షియల్‌ ఖాళీ ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా ఎవరి కోసం మార్చారు? 
నారా బ్రాహ్మణి 25 వేల గజాలను కొనుగోలు చేశాక ఆ ప్లాటు హద్దులు మారిపోయాయి. దక్షిణం వైపున రెసిడెన్షియల్‌ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా సీఆర్‌డీఏ మార్చేసింది. 3,670 గజాల రెసిడెన్షియల్‌ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్‌ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే.. ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతులకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్‌ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్‌ ప్లాట్లను.. ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండి పడుతున్నారు. 

ఇక భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన నివాస స్థలాలు (రెసిడెన్షియల్‌ ప్లాట్‌) గజం రూ.50 వేలు పలుకుతుందని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సీఆర్‌డీఏ లెక్కగట్టింది. వాణిజ్య (కమర్షియల్‌) ప్లాట్‌ ధర రూ.2.70 కోట్లుగా చూపింది. ఎకరం భూమిని సమీకరణ కింద ఇచ్చిన రైతులకు.. పదేళ్లపాటు కౌలు కింద రూ.7,25,000, నివాస స్థలం (వెయ్యి గజాలు.. గజం రూ.50 వేల చొప్పున) రూ.5 కోట్లు, వాణిజ్య స్థలం రూ.2.70 కోట్లు వెరసి రూ.7,77,25,000 ప్రయోజనం చేకూరుతుందని సీఆర్‌డీఏ లెక్కలు వేసింది. ఈ లెక్కన 3,670 గజాల రెసిడెన్షియల్‌ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సీఆర్‌డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. 


వాస్తవ ధర గజం రూ.7,500 లేనా? లేక మోసం చేశారా?
వెలగపూడిలో సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి 25 వేల గజాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర రూ.7,500. అక్కడ రెసిడెన్షియల్‌ స్థలం ధర వాస్తవంగా గజం రూ.7,500లేనా అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కోడలు కొనుగోలు చేసిన భూమి ధరను బట్టి చూస్తే.. ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ.3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.47,387 కోట్లను చంద్రబాబు సర్కార్‌ అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15 వేల ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ.. రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్‌ నుంచి.. అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు. 


ఆ ఎకరం శ్మశానమే.. 
వెలగపూడిలో సర్వే నంబరు 163–బీలో ఎకరం శ్మశానం భూమి. ఇప్పటికీ ఆ భూమిలో సమాధులు ఉన్నాయి. రాజధాని భూ సమీకరణ కోసం వెలగపూడిలో 2015 జనవరి 3న సీఆర్‌డీఏ జారీ చేసిన నోటిఫికేషన్‌లోనూ 163–బీలో ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ.. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్‌లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతి కిరణ్‌దిగా పేర్కొనడం గమనార్హం. ఎవరి ఒత్తిళ్లతో శ్మశానం భూమిని శాంతి కిరణ్‌కు చెందినదిగా మార్చారని వెలగపూడి రైతులు నిలదీస్తున్నారు. 163–బీలో శ్మశానం ఉన్న ఎకరం భూమి కంచెర్ల శాంతికిరణ్‌దిగా చూపుతూ.. దానికిగాను కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ స్థలంతోపాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్‌ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement