బాలుడి దారుణ హత్య | Boy dies in stone pelting by unidentified persons | Sakshi
Sakshi News home page

బాలుడి దారుణ హత్య

Mar 30 2026 4:05 AM | Updated on Mar 30 2026 4:05 AM

Boy dies in stone pelting by unidentified persons

ఇంట్లో నిద్రిస్తున్న బాలుడు, నానమ్మపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి 

తీవ్రంగా గాయపడి పదేళ్ల బాలుడు మృతి 

వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలింపు 

రొయ్యల చెరువుల వద్దకు పని కోసం వచ్చిన అస్సాం, బిహార్‌ వ్యక్తుల పనేనా! 

నందివాడ: ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాలు.. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో గండికోట లక్ష్మి(70) ఒంటరిగా నివాసం ఉంటూ బెల్టుషాప్‌ నిర్వహిస్తోంది. ఆమె కొడుకు గండికోట రామసుబ్బారావు, కోడలు రమాదేవి స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ రాత్రివేళ పనికి వెళ్తారు. 

ఈ నేపథ్యంలో రామసుబ్బారావు తన కొడుకు బాలాజీ(10)ని నానమ్మ లక్ష్మి దగ్గర రాత్రి వదిలేసి వెళ్తాడు. ఉదయం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. బాలుడు చిన్నలింగాలలో ప్రభుత్వ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజువారీ లాగే శనివారం రాత్రి వృద్ధురాలు లక్ష్మి, మనవడు బాలాజీతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. 

ఈ దాడిలో బాలుడు బాలాజీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని తొలుత గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నందివాడ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు స్థానికంగా బెల్టుషాప్‌ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌  రొయ్యల చెరువు వరకు వెళ్లి పోలీస్‌ జాగిలం ఆగిపోయింది. పోలీసులు పలువురి అనుమానితుల వేలిముద్రలు సేకరించారు.  

వారి పనేనా ! 
ఇటీవల మండలవ్యాప్తంగా రొయ్యల చెరువుల వద్ద పని కోసం అస్సాం, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యక్తులు వచ్చారు. వీరు వృద్ధురాలు లక్ష్మి దగ్గర తరచూ మద్యం కొనుగోలు చేస్తారు. దీనికితోడు వారు నిత్యం గంజాయి సేవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారిపైనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో బాలుడి హత్య, వృద్ధురాలిపై దాడి ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురిచేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement