చెట్టు కొమ్మల్లో.. 9 గంటలపాటు ముగ్గురి ప్రాణాలు..! | Bolero vehicle trapped in Veligonda floodwaters midnight rescue operation | Sakshi
Sakshi News home page

చెట్టు కొమ్మల్లో.. 9 గంటలపాటు ముగ్గురి ప్రాణాలు..!

Sep 2 2026 5:42 AM | Updated on Sep 2 2026 5:42 AM

Bolero vehicle trapped in Veligonda floodwaters midnight rescue operation

వెలిగొండ ప్రవాహంలో చిక్కుకున్న బొలెరో వాహనం 

అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్‌  

ముగ్గురినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చిన పొక్లెయిన్‌ ఆపరేటర్‌ 

మార్కాపురం రూరల్‌: వెలిగొండ ప్రాజెక్టు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని అధికారులు అర్ధరాత్రి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌తో రక్షించారు. పెద్దారవీడు మండలం కలనూతలకి బొలెరో వాహనంలో వెళుతోన్న నల్లబోతు­ల శ్రీనివాసులు, రమణ, తిరుపతినాయు­డు సోమవారం రాత్రి వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నీటి ఉధృతి పెరగడంతో వాహనం ముందుకు కదలక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షించాలంటూ వేడుకున్నారు. నల్లబోతుల శ్రీనివాసులుది కలనూతల గ్రామం కాగా ఇంటి సామగ్రి తీసుకుని మార్కాపురం వెళ్తున్నాడు. ఆయనకు రమణ, తిరుపతినాయుడు తోడుగా వెళ్లారు. 

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ముగ్గు­రు చెట్టును ఆశ్రయించారు. 9 గంటలపాటు చెట్టుపైనే ఉండి సహాయం కోసం ఎదురు చూశా­రు. చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి..మరోవైపు రాత్రి కావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచా­రం అందుకున్న అధికారులు ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలో పొక్లెయిన్‌ ఆపరేటర్‌ నాగేంద్ర ప్రాణాలకు తెగించి నీటిలోకి వెళ్లి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. ఒకవైపు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండగా..పొక్లెయిన్‌ ఒరిగిన పరిస్థితిలోనూ వెనుకడుగు వేయకుండా ముగ్గురినీ చాకచక్యంగా మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు సురక్షితంగా ఒడ్డు­కు చేర్చాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాహసోపేతంగా వ్యవహరించిన పొక్లెయిన్‌ ఆపరేటర్‌ నాగేంద్రను కలెక్టర్‌ విజయసునీత అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement