కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్‌ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్‌ చేశారా | Sakshi
Sakshi News home page

Non Veg Pickles: నోరూరించే.. నాన్‌వెజ్‌ పచ్చళ్లు 

Published Sun, Aug 29 2021 10:02 AM

Bhimavaram Special Non Veg Pickles, Very Tasty - Sakshi

మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్‌ వెజ్‌ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్‌వెజ్‌ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్‌వెజ్‌ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే.  

సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్‌): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్‌వెజ్‌ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్‌ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్‌వెజ్‌ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్‌వెజ్‌ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్‌గా మారిపోయారు.

దాదాపు 40 దేశాలకు ఎగుమతి 
భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్‌ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకుంటారు. నాన్‌వెజ్‌ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్‌వెజ్‌ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. 

చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. 

చికెన్‌ వెరైటీలు : బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం 

రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్‌ 

► అలాగే పీత, మటన్‌ బోన్‌లెస్, మటన్‌ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. 

పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు.  

► చికెన్‌ పచ్చడి 
► రొయ్యల పచ్చడి
► నాటుకోడి పచ్చడి 
► పీతల సమోసా 

Advertisement
Advertisement