అదిగదిగో అలనాటి జీవన స్వర్గం! | The beauty of working life in Kurma village | Sakshi
Sakshi News home page

అదిగదిగో అలనాటి జీవన స్వర్గం!

May 9 2025 4:36 AM | Updated on May 9 2025 4:36 AM

The beauty of working life in Kurma village

కూర్మ గ్రామంలో శ్రమైక జీవన సౌందర్యం

యువతకు వేసవి శిక్షణ శిబిరాలు

ప్రకృతి ప్రసాదం, సనాతన ధర్మ విస్తరణ లక్ష్యం  

అనగనగా ఓ కాలంలో.. సెల్‌ కోడి కూయకుండానే నిద్ర లేచేవారు. కరెంటు, రెంటు, ఎక్స్‌ట్రా.. వంటి కష్టాలు లేకుండా ప్రకృతితో మమేకమయ్యేవారు. ఉదయాస్తమయాల మధ్య కాలాన్ని అత్యంత సహజంగా గడిపేవారు. పున్నమి వెలుగు, అమావాస్య చీకటి, వాసంతపు వేకువ, శరత్‌ కాలపు రాత్రుళ్ల కాలాన్ని ఆస్వాదించేవారు. ఆధునికత వచ్చింది. యంత్రాలను తెచ్చింది. బతుకుల్లో సహజత్వం మాయమైపోయింది. కూర్మ గ్రామం మళ్లీ ఆ సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. వందల ఏళ్ల కిందటి జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఆ బతుకుల్లో తీపిని రుచి చూపేందుకు వేసవిలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

హిరమండలం: కరెంటు లేని నివాసాలు.. రసాయనాలు లేని పంటలు, ఆధునికత అంటని బతుకులు.. వెరసి కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుందీ గ్రామం. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018లో గ్రామం ఏర్పాటైంది. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస్‌స్వామి ఆధ్వర్యంలో ఈ పల్లె ఏర్పడింది. ఏడాది పొడవునా ఇక్కడకు వేలాది మంది భక్తులకు తరలివస్తుంటారు. కాగా ప్రస్తుతం కూర్మ గ్రామంలో యువతకు నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.   

అన్నీ సొంతంగానే.. 
కూర్మ గ్రామంలో 80 మంది వరకూ నివాసముంటున్నారు. 20 వరకూ గృహస్తు జీవన కుటుంబాలు ఉన్నాయి. ఓ 20 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతన వీరి విధానం. మనిషికి నిత్యావసరాలుగా భావించే కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదించుకుంటున్నారు. ఏడాదిలో వీరికి అవసరమైన వందలాది బస్తాల ధాన్యాన్ని పండిస్తుంటారు. టన్నుల కొద్దీ కూరగాయలను సాగు చేస్తున్నారు. 

అక్కడ గృహస్తులతో పాటు విద్యార్థులు, ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చే భక్తులకు వాటితోనే ఆహారం తయారుచేసి అందిస్తుంటారు. దంపుడు బియ్యాన్ని మాత్రమే వండుకుంటారు. వారి దుస్తులను వారే తయారుచేసుకుంటారు. ఇళ్లకు వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మెంతులు, కరక్కాయలు, మినుములు మిశ్రమంగా చేసి గానుగ ఆడిస్తారు. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో కలిపి ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడు కాయ రసంతోనే దుస్తులను ఉతుక్కుంటారు.   

వర్ణాశ్రమ విద్య.. 
ఇక్కడ విద్యార్థులు వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తుంటారు. పూర్వపు గురుకులాలతరహాలో ఇక్కడ వాతా వరణం ఉంటుంది. విద్యార్థులు సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. వయసు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు. మనిíÙని సనాతన మార్గం వైపు నడిపించాలన్నదే కృష్ణచైతన్య సమాజం కూర్మ గ్రామం ఏకైక లక్ష్యం. అందుకే ఒక ఇంటితో ప్రారంభమైన ఈ శ్రీకారం ఇప్పుడు దాదాపు 80 ఇళ్ల వరకూ చేరుకుంది.  

ఏటా యువతకు శిక్షణ
ప్రకృతి సమాజాన్ని విస్తరించాలని.. సనాతన ధర్మం వైపు ఈ సమాజం అడుగులు వేయాలని ఏటా యువతకు ఇక్కడ వేసవి శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. నెలరోజుల పాటు చేతివృత్తులు, పురాతన జీవన విధానం, సనాతన ధర్మం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. వర్ణాశ్రమ కళాశాలలో ఈ శిబిరాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. 

చేనేత మగ్గం, మట్టికుండల తయా­రీ, వడ్రంగి, కర్రసాము, నూనెగానుగ, సున్నం గానుగ, వైదిక గృహ నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, గో సంరక్షణ, ఆయుర్వేదం వంటి వాటిపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల శిక్షణ కూడా ఉంటుంది. మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవన ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం, గృహస్థ జీవన శిక్షణ, బ్రహ్మచారి శిక్షణ, సంస్కృత సంభాషణ అభ్యాసనం, మృదంగం, కరతాళ వాదనం శిక్షణ వంటి అంశాలపై నెలరోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది.  

జీవిత లక్ష్యంపై అవగాహన 
మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం. వర్ణాశ్రమ కళాశాలలో బతుకు తెరువు, వృత్తి కళలపై శిక్షణ ఇస్తున్నాం. నెల రోజుల పాటు వేసవి శిబిరాలు కొనసాగుతాయి. గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో కూర్మ లాంటి గ్రామా లను నెలకొల్పాం. హంగేరిలో అయితే 800 ఎక రాల విస్తీర్ణంలో గ్రామం విస్తరిస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌లోనూ ఒక పల్లె ఉంది.       – నటేకర్‌ నరోత్తమదాస్, వర్ణాశ్రమ బోధకుడు, కూర్మ గ్రామం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement