
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, విద్య–నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హెచ్‌ఈ బ్యారీ ఓ ఫారేల్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంగళవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, విద్యాభివృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాలపై బృందంలోని సభ్యులు సీఎం జగన్‌తో చర్చించారు. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, డి శాలినేషన్ ప్లాంట్లు తదితర మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని వివరించారు.
గనుల రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను విశాఖలో నెలకొల్పేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కర్టీన్ సహకారంతో ఈ సెంటర్‌ను నెలకొల్పుతారు. తీర ప్రాంతంలో ఆపారంగా ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునేలా క్రిటికల్ మినరల్స్ రంగంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తృతం చేయాలని నిర్ణయించారు. మెడ్‌టెక్ జోన్‌లో పరిశోధనలకు సహకరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు ఒప్పందం కుదుర్చుకుని, పరిశోధనా రంగంలో సహాయ, సహకారాలు అందిస్తామని ఆస్ట్రేలియా హై కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా కాన్సూల్ జనరల్ సారా కిర్లే, ఫస్ట్ సెక్రటరీ (పొలిటికల్) జే సంగానీ తదితరులు పాల్గొన్నారు.